బ్రిటన్ పార్లమెంట్‌కు తొలిసారిగా సిక్కు మహిళ ఎన్నిక
లండన్:
బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ చరిత్రాత్మక విజయం సాధించి, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి పోటీ చేసి 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి కరోలిన్ స్క్వైర్‌పై గ్రిల్ 6,917 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎడ్జ్‌బాస్టన్‌కు ఎంపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌మన్‌జీత్ సింగ్ దేశి కూడా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు.
స్లోగ్ సీటు నుంచి తన్‌మన్‌జీత్ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్ పార్లమెంట్‌కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారి.