‘ట్రాన్స్–పసిఫిక్’ నుంచి వైదొలగిన అమెరికా
సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్ : ఎన్నికల హామీల్ని వరుసగా ఆచరణలోకి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ –పసిఫిక్ భాగస్వామ్య(టీపీపీ) ఒప్పందం నుంచి వైదొలుగుతూ సంతకం చేశారు. ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్ మహా సముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40 శాతం వాటా కలిగిఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమైన టీపీపీపై ఏడేళ్ల పాటు సభ్య దేశాల మధ్య చర్చలు సాగాయి. 2016, ఫిబ్రవరి 4న తుది ఒప్పందంపై అమెరికాతో పాటు జపాన్ , మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్ , పెరూ, సింగపూర్, బ్రూనై, చిలీలు సంతకం చేశాయి. ఒప్పందాన్ని ఆయా దేశాలు అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. ఆర్థిక సంబంధాల బలోపేతం, వృద్ధి రేటును ప్రోత్సహించడం, పన్నుల్ని తగ్గించడం ఈ ఒప్పందం లక్ష్యం.
ఆ లేఖలో ఏముందో చెప్పను : ట్రంప్
అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ.. తనకు ఒబామా మంచి లేఖ రాశారని ట్రంప్ వెల్లడిం చారు. అయితే ఆ లేఖలో ఏముందనే విషయాన్ని మీడియాకు చెప్పదలచుకోలేదన్నారు. దాన్ని మనసులోనే పెట్టుకుంటానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ కార్యక్రమాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియాతో సంబంధాలపై పునరాలోచన చేస్తామని ట్రంప్ పాలకవర్గం హెచ్చరించింది.