రియల్ ‘టార్జాన్’ బతికే ఉన్నాడు | Real tarzan is still alive | Sakshi
Sakshi News home page

రియల్ ‘టార్జాన్’ బతికే ఉన్నాడు

Published Tue, Sep 15 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

రియల్ ‘టార్జాన్’ బతికే ఉన్నాడు

రియల్ ‘టార్జాన్’ బతికే ఉన్నాడు

సిడ్నీ: దేశంకాని దేశంలో శరణార్థిగా బతకలేక, చుట్టూ ఉన్న మానవ సమాజాన్ని ధ్వేషించి తన 24వ ఏటనే దట్టమైన భయంకరమైన అడువుల్లోకి పారిపోయిన మైఖేల్ పీటర్ ఫొమెంకో ఇంకా బతికే ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. నర వాసన వస్తే పసిగట్టి ఆమాంతం తినేసే మొసళ్లుకు ఆవాసంగా పేరుగాంచిన రెయిన్ ఫారెస్ట్ అడువుల్లో దాదాపు 57 ఏళ్లపాటు జీవితం సాగించిన మైఖేల్‌కు ‘రియల్ లైవ్ టార్జాన్’ అనే పేరుకూడా ఉంది. మొసళ్లను, అడవి పందులను ఒట్టి చేతుల్లో చంపేసే టార్జాన్ అని కూడా ఆయనను పిలుస్తారు. అప్పుడప్పుడు అడవిదారుల్లో కనిపించే మైఖేల్ 2012 నుంచి అసలు కనిపించకపోవడంతో ఆయన మరణించే ఉంటారని ఆయన గురించి తెలిసిన వారు భావిస్తూ వచ్చారు. అయితే ఆయన జింపీస్ కూయిండా వృద్ధాశ్రమంలో ఉన్నట్టు ఇప్పుడు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది.

 మైఖేల్ పీటర్ ఫొమెంకోకు ఇప్పుడు 84 ఏళ్లు. రష్యా రాజకుమారి ఎలిజబెత్ మకాబెల్లీ, ఛాంపియన్ అథ్లెట్ డేనియల్ ఫొమెంకోకు ఏకైక కుమారుడు. అప్పట్లో సోవియట్ యూనియన్‌లో ఉన్న జార్జియాలో వారి కుటుంబం నివసించేది. సంపన్న వర్గానికి చెందిన వారి కుటుంబం అప్పటి సోవియట్ పరిస్థితుల్లో ఇమడలేక జపాన్‌కు వలసపోయింది. 1937లో జపాన్, చైనాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ దశలో మళ్లీ వారి కుటుంబం ఆస్ట్రేలియాకు వలసపోయింది. ఆస్ట్రేలియా వారి కుటుంబానికి శరణార్థి హోదాను మాత్రమే ఇచ్చింది. ఆ దేశంలోనే విద్యాభ్యాసం సాగించిన మైఖేల్ ఇటు చదువులోనూ, అటు ఆటల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1956లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ ఎంపికకు వెళ్లి తృటిలో తప్పిపోయారు.

అప్పటికే  శరణార్థి జీవితం పట్ల కోపంగా ఉన్న మైఖేల్,  గ్రీకు వీరుడు ఒడస్సీ గురించి తొలి యూరప్ రచయిత, కవి హోమర్ రాసిన కవిత్వాన్ని చదవి స్ఫూర్తి పొందారు.  ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా ఉత్తర ఆస్ట్రేలియాలోని ఇంగామ్, కేప్ యార్క్ మధ్యనున్న దట్టమైన రెయిన్ ఫారెస్ట్‌లోకి పారిపోయారు. దాదాపు మూడేళ్ల తర్వాత 1959లో మొసళ్ల చేతిలో గాయపడి చావు బతుకుల మధ్య అక్కడి ఆదిమ తెగల ప్రజల కంట పడ్డారు. వారి చికిత్సతో కోలుకున్న మైఖేల్ అడవుల్లోనే ఒంటరిగా తిరుగుతూ జీవనం సాగించారు. అప్పుడప్పుడు మానవ సంచారం ఉండే రహదారుల్లోకి వచ్చి భయపెడుతున్నారంటూ స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో 1964లో ఆస్ట్రేలియా అటవి శాఖ సిబ్బంది గాలించి ఆయన్ని పట్టుకుంది. ఆస్పత్రిలో చేర్పించింది. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ ఆయన్ని మానసిక చికిత్సాలయానికి పంపించారు. ఆయన అక్కడి నుంచి కూడా తప్పించుకొని మళ్లీ అడవుల్లోకి పారిపోయారు.

 అప్పటి నుంచి అప్పుడప్పుడు నాగరిక ప్రపంచంలోకి వచ్చి పోతున్నా ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆయనను చూసినప్పుడల్లా ‘అదిగో టార్జాన్ వచ్చాడు’ అని స్థానికులు పిలిచేవారట. అమెరికా రచయిత జాన్ క్రెకౌర్ ఈ టార్జాన్‌ను స్ఫూర్తిగా తీసుకొనే ‘ఇన్ టూ ది వైల్డ్’ అనే నవల రాశారేమో! ఈ నవలను దర్శక నిర్మాత సియాన్ పెన్ అదే పేరుతో 2007లో సినిమా తీశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఆ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమాలో కూడా హీరో మానవ సమాజానికి దూరంగా అడవుల్లోకి పారిపోతాడు. ఆహారంగా విషపు గింజలను తినడం వల్ల జబ్బు పడతాడు. డైరీ రాసే అలవాటున్న ఆ హీరో  తోటి మానవులతో విషయాలను షేర్ చేసుకున్నప్పుడే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఆఖరి పంక్తి రాసి చనిపోతాడు.
 

Advertisement
Advertisement