59 ఏళ్ల వ్యక్తి హై స్పీడ్ జర్మన్ ట్రైన్‌ను పట్టుకొని వేలాడుతూ దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించారు. జర్మనీలో పర్యటిస్తున్న ఓ రొమానియన్ తన లగేజీని ట్రైన్‌లోనే మరిచి పోయి బిలేఫీల్డ్ స్టేషన్ ఫ్లాట్‌ఫాంపై దిగిపోయారు. అంతలోనే ట్రైన్ స్టార్ట్ అవ్వడంతో డోర్లు మూసుకుపోయాయి. ఎలాగైనా తన లగేజీని తీసుకోవాలనే తొందరలో హై స్పీడ్ ట్రైన్‌ని పట్టుకున్నారు. రెండు బోగీలను కలిపే భాగంలో ట్రైన్‌ని పట్టుకొని సదరు వ్యక్తి దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించారు.
ట్రైన్ స్టాఫ్ బయటవైపు ఉన్న రొమానియన్‌ను గమనించి డ్రైవర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో స్టాప్‌లేకపోయినా తదుపరి స్టేషన్‌లో డ్రైవర్ ట్రైన్‌ని ఆపారు. ఆ వ్యక్తి తిరిగి అదే ట్రైన్‌లో తన లగేజీని తీసుకొని హనోవర్ వరకు వెళ్లారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని జర్మనీ అధికారులు తెలిపారు.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్‌ను ఎలా పట్టుకుని వేలాడో... మిషన్ ఇంపాజిబుల్ సినిమా చాలా సార్లు చూశాడేమో అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, అతన్ని విచారించనున్నారని అధికారులు తెలిపారు.