ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ నాయకత్వం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్(69) అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన నేపథ్యంలో.. ఆయనను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించింది. సూపర్ ట్యూస్‌డే ప్రైమరీల అనంతరం ట్రంప్ వెంట 319 మంది పార్టీ ప్రతినిధులుండగా, పార్టీలోని ఆయన ప్రత్యర్థి టెడ్ క్రుజ్‌కు 226 మంది, మార్కొ రూబియొకు 110 మంది ప్రతినిధుల మద్దతుంది. పార్టీ నామినేషన్ దక్కించుకునేందుకు ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రసిడెన్షియల్ ప్రైమరీల్లో గెలిచిన 2,472 డెలిగేట్స్‌కు గానూ 1,237 మంది మద్దతు అవసరం ఉంటుంది.
అంటే ఇంకా ట్రంప్‌కు 918 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. అయితే, రిపబ్లికన్ పార్టీలోని అగ్ర నాయకత్వం ట్రంప్ అభ్యర్థిత్వం పట్ల విముఖతతో ఉన్నారని అమెరికా ప్రధాన మీడియా కథనాలు ప్రచురించింది.