రియాద్: సౌదీ అరేబియా మక్కా ప్రావిన్స్లోని తాయిఫ్ నగరంలో పలు నివాసాలను పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలోని ఒకరు పోలీసులు కన్నుగప్పి పరారైయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడి.... లొంగిపోవాలని హెచ్చరించారు. అందుకు అతడు పోలీసులకు ఎదురు తిరిగి వారిపైకి కాల్పులకు తెగబడ్డాడు.
దాంతో పోలీసులు వెంటనే స్పందించి తీవ్రవాదిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో తీవ్రవాది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ముగ్గురు తీవ్రవాదులు పోలీసుల అధీనంలోనే ఉన్నారని దేశ హోంశాఖ మంత్రి వెల్లడించారు. తీవ్రవాదులు నివసిస్తున్న ఇంటి నుంచి ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన జెండాలు, తుపాకులు, కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని హోం శాఖ మంత్రి తెలిపారు.