ఎడారిలో మంచు కురిసింది!
ఎడారిలో మంచు కురిసింది!
Published Fri, Dec 2 2016 10:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
గల్ఫ్ దేశాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి ఎడారులే. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడ ఎడారులన్నీ తెల్లటి మంచుతో మెరిసిపోతున్నాయి. జనం ఏసీలు వేసుకోడానికి బదులు రూం హీటర్లు పెట్టుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్తే ఎప్పుడూ లేనట్లుగా స్వెటర్లు, మఫ్లర్లు.. ఇలాంటి దుస్తులతో వెళ్లాల్సి వస్తోంది. ఆరు బయట కురుస్తున్న మంచుతో అమెరికా లాంటి దేశాల్లో కనబడే ''స్నోమాన్'' బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు -3 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోయాయి. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఇక్కడ అక్టోబర్ నెల వరకు ఓ మాదిరి వర్షపాతం ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా అక్కడ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి.
సాధారణంగా ఇక్కడ శీతాకాలంలో ఇంత పెద్ద ఎత్తున మంచు పడటం ఉండదు. దాంతో ఇప్పుడు కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీ అరేబియన్లు, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులు మంచి సంబరంగా కనిపిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడి వర్షపాత కాలం ముగిసిపోయి 40 రోజులు అయిపోయినా, ఇప్పుడు మళ్లీ రెండో వర్షాకాలం మొదలైందని ఖాసిమ్ యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రాల ప్రొఫెసర్ అబ్దల్లా అల్ ముసానద్ తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో సౌదీ అరేబియాలో వచ్చిన వరదల కారణంగా 18 మంది మరణించారు. ఇప్పటికైతే మాత్రం కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీలు సరదాలు తీర్చుకుంటున్నారు. స్నోమాన్ బొమ్మలు చేసి వాటితో సెల్ఫీలు దిగుతున్నారు.
Advertisement
Advertisement