మహిళలపై పెత్తనం వద్దన్నందుకు ఏడాది జైలు
రియాద్: పురుషుల పెత్తనంపై ప్రశ్నించిన వ్యక్తిని జైలులో వేశారు. ఏడాదిపాటు అతడిని జైలులోనే ఉంచాలని ఆదేశాలిచ్చారు. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. మహిళలపై పురుషుల ఆధిపత్యం చాలా ఎక్కువైందని, దానికి స్వస్తి పలకాలని ఓ ముస్లిం వ్యక్తి డిమాండ్ చేశాడు. ‘మహిళలపై ఆదిపత్యాన్ని చాలించాలి. మహిళ సంరక్షణ పేరిట చేసే అధికార చెలాయింపునకు స్వస్తి పలకండి’ అంటూ ఓ ముస్లిం వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
అంతటితో ఆగకుండా ఆయా మసీదులపై తన డిమాండ్‌ను పోస్టర్లలో వేయించి అతికించాడు. సౌదీలో పురుషుల ఆదిపత్యం పేరిట దాడులు కూడా జరుగుతున్నాయని, మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిదంటూ అతడు తన గొంతు వినిపించాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు దమామ్‌లోని కోర్టుకు తరలించగా ఏడాది జైలు శిక్షతోపాటు ఎనిమిది వేల డాలర్ల జరిమానా కూడా విధించారు.