
జూలై నుంచి స్కై టాక్సీలు
దుబాయ్ :
ఓ కాల్ చేస్తే ఇంటిపైకి ఎగురుకుంటూ స్కై టాక్సీ వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కేసి? ఎక్కడికెళ్లాలో క్లిక్ చేస్తే చాలు. నిమిషాల్లో మీరు గమ్యం చేరిపోవచ్చు. అవునండీ ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఆకాశంలో డ్రోన్లో షికారు చేయాలని వేచి చూస్తున్న వారికి ఇదో శుభవార్త. జూలై నుంచి దుబాయ్‌లో డ్రోన్లు గాల్లో షికార్లు కొట్టడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వరల్ఢ్ గవర్నమెంట్ సదస్సులో దుబాయ్ రోడ్లు, రవాణా సంస్థ అధిపతి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ డ్రోన్లు 100కిలోల వరకు బరువును తీసుకువెళ్లగలవు. ప్రయాణికుడు ఎక్కడికి వెళ్లాలో టచ్ స్క్రీన్‌పై క్లిక్ చేస్తే చాలు, మరే ఇతర కంట్రోల్‌ల అవసరం లేకుండానే గమ్యస్థానాన్ని చేరేయోచ్చు. ట్రాఫిక్ సమస్యలేకుండా ఎంచక్కా విహరించవచ్చు. గంటకు గరిష్ఠంగా 160 కిమీ వేగంతో, 50 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలుగుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు 30 నిమిషాల వరకు గాల్లో చక్కర్లు కొట్టొచ్చు. ఉబర్, గూగుల్, అమెజాన్ సంస్థలు కూడా డ్రోన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి.