వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాల నుంచి అమెరికా వచ్చే పౌరులపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది అమెరికాకు వలస వచ్చిన వారే అయిన నేపథ్యంలో.. వారంతా ట్రంప్ చర్యపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. అదే సమయంలో గూగుల్తో పాటు టాప్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి.
లిబియా, ఇరాక్, ఇరాన్, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కఠినమైన నేపథ్యంలో.. ఆ దేశాలకు చెందిన వారు ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోవాలని తమ ఉద్యోగులను గూగుల్ ఆదేశించింది. ఆంక్షలు 90 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో.. ఆంక్షలు ఎత్తివేసేవరకు ప్రయాణాలు మానుకోవాలని కోరింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు వచ్చే మేథోవలసకు అడ్డుగా మారుతుందని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్.. శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో సైతం పాల్గొన్నారు.
ట్రంప్ నిర్ణయం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. ట్రంప్ పాలసీని యాపిల్ సపోర్ట్ చేయదని అన్నారు. ఇమ్మిగ్రేషన్ లేకుండా అసలు ఆపిల్ ఉండదని లేఖలో పేర్కొన్నారు. అలాగే బ్యాన్తో విమానాశ్రయంలో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు సంస్థ తరఫున సహకారాలుంటాయని తెలిపారు. ఎవరు ఎక్కడనుంచి వచ్చారు అనేదానితో సంబంధం లేకుండా అందరికీ ఆపిల్ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆయన వెల్లడించారు.
ఇండియా నుంచి వలస వెళ్లి మైక్రోసాఫ్ట్ సీఈవోగా పనిచేస్తున్న సత్యానాదెళ్ల.. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు లీగల్ సపోర్ట్ అందిస్తామని వెల్లడించారు. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి వచ్చిన 76 మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులపై ప్రభావం పడనుంది.
అమెజాన్ సంస్థ సైతం ముస్లిం దేశాలపై బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకించింది. భిన్నత్వంతో కూడిన ఉద్యోగులు ఉండటం వల్లే ఉత్తమ ఉత్పత్తులు సాధ్యమయ్యాయని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను సంస్థలో చేరేలా ఆకర్షించడమే తమ విజయానికి కారణమని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విధించిన ఆంక్షలు 90 రోజులపాటు కొనసాగుతాయని చెబుతున్నా.. మరికొంత కాలం వీటిని పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్పై మండిపడుతున్న టెక్ దిగ్గజాలు
Published Mon, Jan 30 2017 5:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
Advertisement
Advertisement