జపాన్‌లో టైం అంటే టైమే..
జపాన్‌లో రైళ్ల సమయపాలన చూస్తే మనోళ్లు నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా? అక్కడ ట్రైయిన్ ఐదు నిమిషాలు లేటయినా ప్రయాణికులకు రైల్వే సిబ్బంది సారీ చెబుతారట! అక్కడితో ఆగకుండా.. రైలు ఆలస్యంగా వచ్చినట్టు సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ఉద్యోగులు ఆఫీసుకు ఆలస్యమైతే అందుకు కారణంగా ఈ సర్టిఫికెట్‌ను చూపించే వెసులుబాటు ఉందట. ఇక రైలు ఒక గంటగానీ ఆలస్యంగా వస్తే అది పెద్ద వార్త అయి కూర్చుంటుంది!
జపాన్ బుల్లెట్ ‘బ్రెయిన్’
జపాన్ బుల్లెట్ ట్రెయిన్ ఎలా పుట్టిందో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు జార విడిచే కమికాజే డైవ్ విమానాలకు డిజైన్ చేసిన ఓ ఇంజనీర్ బ్రెయిన్ నుంచి పుట్టింది. తాను రూపొందించిన కమికాజే విమానాల విధ్వంసం చూసి ఆయన తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు. తన నైపుణ్యాన్ని శాంతి కోసం వాడాలని నిర్ణయించుకొని షింకన్‌సేన్ (బుల్లెట్ రైలు) డిజైన్‌ను రూపొందించాడు. ఇప్పటివరకు ఈ బుల్లెట్ రైలు ఒక్కసారి కూడా ప్రమాదానికి గురికాకపోవడం గమనార్హం.