
ద బీస్ట్.. ఈ కారు చాలా స్పెషల్ గురూ!
వాషింగ్టన్: బాంబులతో దాడి చేసినా ఏమీకాదు. బుల్లెట్ల వర్షం కురిపించినా చెక్కు చెదరదు. మందుపాతర పేల్చినా దానికి ఇసుమంత కూడా నష్టం వాటిల్లదు. ఈ లక్షణాలన్నీ ఓ కారుకు ఉన్నాయి. దాని పేరు 'ద బీస్ట్'. దాని ప్రత్యేకతలేంటో ఓసారి చూస్తారా..
ఈ కారు 18 అడుగుల పొడవు, 8 టన్నుల బరువు ఉంటుంది. ఆ వాహనం టైర్లు పంక్చర్ కావు. ఇంధన ట్యాంకు పేలకుండా నిరోధించేందుకు ప్రత్యేకంగా ఫోమ్ ఉంటుంది. రాత్రిపూట పనిచేసే 'నైట్ విజన్' కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. అలాగని ఈ కారును ఎవరు పడితే వారు నడపడానికి వీల్లేదు. ఈ కారును నడపాలంటే 180 డిగ్రీల్లో నడిపేలా ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండాలి.
ఈ కారును వినియోగించేది ఎవరో కాదు... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఈ కారులో శాటిలైట్ ఫోన్ ఉంటుంది. అది నేరుగా పెంటగాన్కు, అమెరికా ఉపాధ్యక్షుడికి కలుస్తుంది. వాస్తవానికి భారత పర్యటన సందర్భంగా కూడా ఒబామా ఈ కారులోనే వస్తారని అంతా అనుకున్నారు. కానీ, భారత్లో ఉన్న ప్రొటోకాల్ కారణంగా ఒబామా ఈ కారును తీసుకురావట్లేదు.