అగ్నిపర్వతం లోపల 'వై-ఫై' సెన్సర్లు
మనాగ్వ: ప్రపంచంలో ప్రమాదకర అగ్నిపర్వతాల్లో నికరాగ్వాలోని మసాయా అగ్ని పర్వతం ఒకటి. ఎప్పుడూ రగులుతుండే ఈ అగ్నిపర్వతం ఎప్పుడు బద్ధలవుతుందో ఏ పరిశోధకుడు అంచనా వేయలేకపోతున్నారు. ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదమున్న ఈ పర్వతం బద్ధలయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడడం ఖాయం. అందుకే ఈ పర్వతాన్ని ‘మృత్యు ముఖద్వారం (మౌత్ ఆఫ్ హెల్)’ అని పిలుస్తారు. 2008లో ఈ పర్వతం ఓ మోస్తారుగా పేలినప్పుడే ఆరు కిలోమీటర్ల ఎత్తువరకు ఆకాశంలోకి బూడిద చిమ్మింది. ఇది 54 చరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది.
ఈ అగ్నిపర్వత ప్రమాదం నుంచి ప్రజలను రక్షించేందుకు కంకణం కట్టుకున్న పరిశోధకులు అత్యంత సాహసోపేతమైన అద్భుత ప్రాజెక్టు ఆవిష్కరణకు నడుం బిగించారు అగ్నిపర్వత బిళంలోపల గ్యాస్ ఎంతుంది? ఎంత ఉష్ణోగ్రత ఉంది? వాతావరణ ఒత్తిడెంత? గురుత్వాకర్షణ శక్తి ఎంత? ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా 80 వై-ఫై సెన్సర్లను అమర్చడమే వారు చేపడుతున్న అద్భుత ప్రాజెక్టు లక్ష్యం. అందుకోసం పరిశోధక బృందం అగ్నిపర్వతంలోనికి 1200 అడుగుల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
ఈ ప్రాజెక్టుకు వాల్కనో డైవర్‌గా పేరుపొందిన శ్యామ్ కాస్‌మేన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన బృందంలో రిగ్గర్లు, ఇంజనీర్లతోపాటు మాజీ హ్యోమగామి కూడా ఉన్నారు. అగ్నిపర్వతం లోపల సెన్సర్లను అమర్చడం ద్వారా పర్వతం స్థితిగతులను, కదలికల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేసి వాటిని విశ్లేషించిన డేటాను జనరల్ ఎలక్ట్రానిక్స్ ఫేస్‌బుక్ పేజీకి అనుసంధానం చేస్తారు. ఈ డేటా ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రయోగం విజయవంతమయితే శాస్త్ర పరిశోధనా రంగంలో అదో మైలు రాయి అవుతుందని, అనంతరం ప్రపంచంలోని ప్రమాదకరమైన అన్ని అగ్ని పర్వతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకుడు గిలెర్మో కారావాంటెస్ మీడియాకు తెలిపారు