
300 డాలర్లతో ప్రపంచాన్ని చుట్టేశాడు..
ప్రయాణాలు చేయాలంటే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులకు వెళ్లి టిక్కెట్లు కొనుగోలుచేసే కాలం ఎప్పుడో పోయింది. ఆఫర్లు ఇచ్చేందుకు ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు ఒకదాని మించి మరొకటి పోటీపడుతున్నాయి. ఇలాంటి ఆఫర్లను అవసరానికి ఉపయోగించునే వారు కొందరైతే.. అవసరం లేకపోయినా ఆఫర్ల కోసం ప్రయాణించే వారు మరికొందరు. అలాంటి జాబితాకు చెందిన ఒక యువకుడు ఫస్ట్‌క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రముఖ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాల్లో ప్రపంచ దేశాలు చుట్టేశాడు.
ఎవరతను..?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన పసదేనా నగరానికి చెందిన 26 ఏళ్ల హాంగ్.. లగ్జరీ ఫ్లైట్లలో లక్షల మైళ్లు తిరిగాడు. అందులో గొప్పేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి మనోడి స్పెషల్. అందరికీ భిన్నంగా అతి తక్కువ ధరల్లో ఫ్లైట్ టికెట్లు సంపాదించి ఫస్ట్ క్లాస్ సదుపాయాలను ఎంజాయ్ చేశాడు. ఎయిర్‌వేస్ ఇచ్చే ఆఫర్లలో లూప్ హోల్స్ తెలుసుకుని తక్కువ ధరకు లభించే టిక్కెట్లతో లగ్జరీ ప్రయాణాలు చేసేశాడు.
ముక్కున వేలేసుకోవాల్సిందే..
సింగపూర్ నుంచి న్యూయార్క్‌కు 60,000 డాలర్ల ఖరీదు ఉండే ఎమిరేట్స్ ఫ్లైట్ మొదటి తరగతి టికెట్‌ను కేవలం 300 డాలర్లకు చేజిక్కించుకున్న మనోడి తెలివితేటలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం సెలబ్రిటీలు, ప్రముఖులకు మాత్రమే కేటాయించే సీట్లలో మూడు వారాల్లో 11 నగరాలు, 7 దేశాలు, 5 ఖండాలను చుట్టేశాడు.
తనలాంటి వారికో సలహా..
సుమారు 15 క్రెడిట్ కార్డులు వాడుతున్న హాంగ్.. తనలా ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే వారికి చిన్న సలహా ఇస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో కార్డుతో సైన్‌అప్ చేయాలనీ.. అదీ ఒక్క క్రెడిట్ కార్డుకు కూడా బ్యాలెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు బిల్ కట్టేస్తుండాలనీ చెప్తున్నాడు. ఒకవేళ ఏమాత్రం బిల్లు చెల్లించక పోయినా కార్డుతో అనవసర ప్రయోగాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాడు. ఎయిర్‌లైన్స్‌లోని కిష్టమైన లొసుగులు తెలుసుకోడానికి ఎంతో ప్రణాళిక, పరిశోధన అవసరమనీ.. సరైన సమాచారాన్ని పొందిన తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్ ప్రారంభించాలని అంటున్నాడు. తాను ఎంతో కష్టపడి సేకరించిన సమాచారం సగటు వినియోగదారుడికి ఎంతో లాభిస్తుందని చెప్పాడు.
సౌకర్యాలు..
బోర్డింగ్ సమయంలో ఉండే క్యూలు, రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఇమిగ్రేషన్‌తో ఫాస్ట్‌ట్రాక్ సేవలు అందుకున్నాడు. స్లైడింగ్ డోర్లు, మినీబార్లు, పడుకునేటప్పుడు బెడ్‌గా మారే సీట్లు, ఎగ్జిక్యూటివ్ చెఫ్‌లు తయారు చేసే కోరిన భోజనం.. ఇలా అన్నింటినీ తన తెలివితేటలతో సొంతం చేసుకున్నాడు.
ఏమిటా కిటుకు..?
క్రెడిట్ కార్డు బోనస్‌లు, టికెట్ బు కింగ్‌లో ఉన్న లొసుగులు తెలుసుకుని విమానంలో స్పా, స్నానాలతో సహా.. దేన్నీ వదిలిపెట్టకుండా ఉపయోగించుకున్నాడు. అలెస్కా ఎయిర్‌లైన్‌తో భాగస్వామ్యం ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు పాయింట్లను ఉపయోగించి ట్రిప్‌ల అదును చూసుకుసి ఫ్రీగా బుక్ చేసేవాడు.