లైవ్ చాటింగ్.. ఇద్దరు యువతుల దుర్మరణం!
వాషింగ్టన్: ఇద్దరు టీనేజీ యువతులు ఫేస్ బుక్ లైవ్ ఛాటింగ్ చేస్తూ రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రూక్ మిరండా హ్యూస్, చనియా మారిసన్ గత మంగళవారం రాత్రి తమ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వారు ఫేస్ బుక్ లైవ్ వీడియో చాట్ చేస్తున్నారు.
ఇంతలో ఓ ట్రాక్టర్ రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న కారు మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు టీనేజీ యువతులు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన 8 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చాటింగ్ లో అవతల వైపు ఉన్న వ్యక్తి వీరికి ఏం జరిగిందో అర్థంకాక కంగారుపడ్డారు. చివరికి తమ వద్ద ఉన్న వీడియోతో తన ఫ్రెండ్స్ చనిపోయారని గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ఇద్దరు యువతుల మృతదేహాలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. ఫేస్ బుక్ 2015లో లైవ్ వీడియో చాటింగ్ ఫీచర్ కల్పించినప్పటి నుంచీ చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, నెటిజన్ల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదాలు జరుగుతున్నాయని వివరించారు.