ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై తీసుకునే చర్యలను యూకే ప్రభుత్వం కఠినతరం చేసింది.
లండన్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై తీసుకునే చర్యలను యూకే ప్రభుత్వం కఠినతరం చేసింది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, మెసెజ్‌లు చేయడం, ఈ మెయిల్ పంపడం వంటి చర్యలకు పాల్పడే వారికి కఠినమైన తీసుకునేందుకుగానూ నూతన నిబంధనలను తేనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న ఈ నూతన నిబంధనల ప్రకారం ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారికి 200 పౌండ్స్ జరిమానా విధించనున్నట్లు యూకే రవాణా మంత్రి క్రిస్ గ్రెలింగ్ తెలిపారు.
ఫోన్ వాడుతూ పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై ఆరు పాయింట్లు చేరుతాయని, ఇలా వారి పాయింట్లు 12కు చేరితే సదరు వ్యక్తి లైసెన్స్ రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిబంధనలు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో వర్తించనున్నాయన్నారు. రెండు సార్లు ఇలా పట్టుబడితే వారి లైసెన్సును ఆరు నెలలు రద్దు చేయడమేకాకుండా కనీసం 1,000 పౌండ్ల జరిమానా విధించనున్నామని ఆయన వివరించారు. త్వరలోనే ఈ నిబంధనలను అమలు చేయనున్నామని, ఈ నిబంధనల ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నామని గ్రెలింగ్ తెలిపారు.