
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21
భారత్ ప్రతిపాదనకు ఐరాస ఆమోదం
ఐక్యరాజ్యసమితి: జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ మేరకు భారతదేశం ప్రతిపాదించిన తీర్మానానికి గురువారం ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. భారత రాయబారి అశోక్ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 193 సభ్యదేశాలున్న సమితిలో రికార్డు స్థాయిలో 177 దేశాలు మద్దతు ప్రకటించాయి. సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద స్థాయిలో మద్దతు రావడం ఇదే తొలిసారి. అలాగే సమితిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం.
ప్రపంచ ఆరోగ్యం, విదేశాంగ విధానం అజెండాలో భాగంగా ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా యూఎన్ ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ మాట్లాడుతూ ఇది అభివృద్ధికి, శాంతికి దోహదం చేయడంతో పాటు మనుషులను ఒత్తిడి నుంచి దూరం చేస్తోందని చెప్పారు. జూన్ 21న సుదీర్ఘమైన పగటి రోజు ఉండడంతో ప్రపంచంలోని చాలాదేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సెప్టెంబర్‌లో ఐరాసలో ప్రసంగం సందర్భంగా భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఈ ఆలోచన 3 నెలల్లోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. కాగా, యోగాపై తీర్మానాన్ని ఐరాస ఆమోదించడంపట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.