న్యూడ్ వీడియోపై స్పోర్ట్స్ యాంకర్ కంటతడి!
నేష్‌విల్లే: తాను దుస్తులు మార్చుకుంటుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడని తెలిసినప్పుడు తాను దిగ్భ్రమ చెందానని, తీవ్ర అవమాన భారంతో కుంగిపోయానని అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ ఈరిన్ ఆండ్ర్సూ కన్నీటి పర్యంతమవుతూ కోర్టులో తెలిపింది. తన నగ్న వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టిన వ్యవహారంలో మారియట్ నేష్‌విల్లే హోటల్‌పై ఆమె 75మిలియన్ డాలర్ల (రూ. 511 కోట్ల) పరువు నష్టం దావా వేసింది. ఈ కేసులో సోమవారం ఆండ్ర్సూ తన వాంగ్మూలాన్ని కోర్టు జ్యూరీకి నివేదించింది. ఘటన జరిగిన నాటినుంచి తాను నిద్రలేని రాత్రులు గడిపానని, దీనంగా రోదిస్తూ కుంగుబాటుకు గురయ్యానని ఆమె తెలిపింది.
2008లో వాండర్‌బిల్ట్ ఫుట్‌బాల్ క్రీడలు కవర్ చేసేందుకు స్పోర్ట్స్ యాంకర్ అయిన ఈరిన్ ఆండ్ర్సూ అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మారియట్ నేష్‌విల్లే హోటల్ లో దిగింది. అయితే ఆమె గది పక్కనే దిగిన మైఖేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఆమె రూమ్‌లోకి రంధ్రం చేసి.. ఆమె దుస్తులు మారుస్తుండగా వీడియో తీసి.. ఇంటర్నెట్‌లో పెట్టాడు. గతంలో 'డ్యాన్సింగ్ విత్ స్టార్స్' అనే టెలివిజన్ షోలో కూడా కనిపించిన ఆండ్ర్సూ ఈ వ్యవహారంలో ఆ హోటల్‌ను కోర్టుకు ఈడ్చింది.
ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయం దర్యాప్తులో వెలుగులోకి రాకముందే.. తానే స్వయంగా ఈ వీడియో తీసి.. పబ్లిసిటీ కోసం ఇంటర్నెట్‌లో పెట్టానని దినపత్రికలు రాశాయని ఆమె కోర్టుకు తెలిపింది. హోటల్ సిబ్బంది తన గది నంబర్‌ను వెల్లడించడం వల్లే తన గది పక్కన రూమ్ తీసుకొని దుండగుడు ఈ పనికి పాల్పడ్డాడని పేర్కొంది. తన గది పక్కనే రూమ్ కావాలని ఓ వ్యక్తి తమను కోరినట్టు మారియట్ సిబ్బంది తనకు ముందే చెప్పి ఉంటే తాను వెంటనే పోలీసులకు ఫోన్ చేసేదానినని, దీంతో ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆమె తెలిపింది. అయితే హోటల్ తరఫు లాయర్ మాత్రం ఈ వ్యవహారంలో నేరమంతా నిందితుడు డేవిడ్ బ్యారెట్‌దేనని, హోటల్‌ది ఇందులో ఏమాత్రం తప్పిదం లేదని వాదించాడు.