
32 ఏళ్ల కష్టార్జితం.. సెకన్లో దానం
వాషింగ్టన్: అమెరికాలోని జార్జియాకు చెందిన తండ్రి,కొడుకు కలిసి మూడు దశాబ్దాల పాటు శ్రమించారు. తాము సంపాదించిన డబ్బుతో ఏదో తమకు కావలసిన విలాసవంతమైన భవనమో, కారో లేక కావలసిన వసతిని సమకూర్చుకోలేదు. 32 ఏళ్లపాటు శ్రమించి కూడబెట్టిన డబ్బును నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 2.6 కోట్ల రూపాయలు) ఒక్క సెకన్లో దానం చేసి తమది విశాల హృదయం అని నిరూపించుకున్నారు అమెరికా తండ్రీకొడుకులు.
జానీ జెన్నింగ్స్(86), బ్రెంట్ జెన్నింగ్స్(49) జార్జియాకు చెందిన వారు. సరిగ్గా 32 ఏళ్ల కిందట(1985లో) ఓ రోజు వీరిద్దరూ అనాథపిల్లల వసతి గృహానికి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు చిన్నారులు వీరి వద్దకు వచ్చి మాకు తండ్రిగా ఎవరైనా ఉంటారా, మా బాగోగులు చూస్తారని అని జానీ, బ్రెంట్‌ను అడిగారు. దీంతో తండ్రీకొడుకుల హృదయం కరిగిపోయింది. వీరికోసం ఏదైనా చేయాలని భావించారు.
ఇక అది మొదలుకుని తాము చేసే వృత్తి రీసైక్లింగ్ ద్వారా రోజు డబ్బు పోగుచేసేవారు. తమ ఖర్చులకు పోనూ మిగిలని నగదును అనాథల కోసం దానం చేయడానికి ఇద్దరూ చెమటోడ్చారు. ఈ క్రమంలో 9 మిలియన్ పౌండ్ల పేపర్‌ను వీరు రీసైకిల్ చేసి తమ ఖర్చులు పోనూ రూ.2.6 కోట్లు కూడబెట్టారు. ఈ సంపదనంతా స్థానిక చారిటీ జార్జియా బాప్తిస్ట్ చిల్డ్రన్స్ హోమ్ కు చెక్ రూపంలో విరాళం ఇచ్చేశారు. కేవలం ఒక్క సెకన్ల వ్యవధిలో అందజేసిన చెక్ ఎంతో మంది చిన్నారులలో సంతోషాన్ని నింపుతుందని, భవిష్యత్తులోనూ ఇలాగే చేయూత అందిస్తామని జానీ, బ్రెంట్ తెలిపారు.