జకార్తా : ఇండొనేసియాలో అగ్నిపర్వతం బద్దలై లావా పెల్లుబికింది. ఉత్తర సుమత్రా దీవిలోని కారో జిల్లాలో ఉన్న సీనాబంగ్ అగ్ని పర్వతం నుండి ఆదివారం లావా విరజిమ్మింది. ఏడువేల మీటర్ల ఎత్తున బూడిద మేఘాలు కుమ్ముకున్నాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదట్లో 2.475 మీటర్ల ఎత్తున ఎగిసిన బూడిద మేఘాలు ఆ తర్వాత మరింత ఎత్తుకు ఎగిసాయని అధికారులు చెప్పారు.
మూడు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వివరించారు.గత నెల 24న ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు మూడువేల మీటర్ల ఎత్తున లావా విరజిమ్మింది.మళ్లీ ఆదివారం లావా పెల్లుబికింది.కాగా ఇండొనేసియాలో లావా విరజిమ్మే 129 అగ్నిపర్వతాల్లో సీనాబంగ్ పర్వతం కూడా ఒకటని అధికారులు చెప్పారు.