
'స్కూళ్లలో గన్స్ ను అనుమతించాలి'
లాస్ ఏంజిల్స్: ముళ్లును ముళ్లుతోనే తీయాలంటున్నాడు నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, ఉద్యమకారుడు విన్స్ వాన్. విద్యా వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని ముష్కర మూకలు చేసే దాడులను తిప్పికొట్టాలంటే తరగతి గదుల్లోకి తుపాకీలను అనుమతించాల్సిన అవసరముందని ఈ 50 ఏళ్ల నటుడు అభిప్రాయపడ్డాడు. స్కూళ్లలో తుపాకీలను అనుమతిస్తే ఆ అమానుష చర్యల నుంచి విద్యార్థుల ప్రాణాలను కాపాడుకునే వీలుంటుందన్నాడు. కొంతమంది స్కూళ్లలో విధ్వంసం సృష్టించే క్రమంలో ఎంతోమంది అమాయక ప్రజలు బలి అవుతున్న విషయాన్ని గుర్తు చేశాడు.
'దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడతారు. ఆ సమయంలో స్కూళ్లలో గన్స్ ఉండవు. తరగతి గదుల్లో తుపాకులు అనుమతించరని ముష్కరులకు తెలుసు. భారీ ఎత్తున అమాయకులపై విరుచుకుపడతారు. ఆ దాడులను తిప్పి కొట్టడానికి గన్స్ ను స్కూళ్లలో అనుమతించడం ఒక్కటే సరైన మార్గం' అని విన్స్ వాన్ తెలిపాడు. మనం ఆయుధాలను చేతపట్టకుండా సమాజంలో హెచ్చు మీరుతున్న నేర ప్రవృత్తిని నిర్మూలించలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.