న్యూయార్క్: ఏడు దేశాల ముస్లింలు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు స్పందించారు. ఇప్పటికే ఆయా దేశాల్లోని ప్రజలు, టెకీలు, యువత, అమెరికాకు చెందినవారే స్వయంగా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతుండగా తొలిసారి కొన్ని దేశాలకు చెందిన నేతలు స్పందించారు. ఆ ప్రతిస్పందనలు ఒకసారి పరిశీలిస్తే...
బ్రిటన్..
బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ట్రంప్ నిర్ణయంపై స్పందిస్తూ ముస్లింలపై నిషేధించడమనేది 'ఓ విభజన, తప్పు' అని చెప్పగా ఇలాంటి నిర్ణయం సిగ్గుచేటు, క్రూరమైన చర్య అని లండన్ మేయర్ చెప్పారు. అయితే, ఇలాంటి వాటిని తాము అంగీకరించబోమని చెప్పిన బ్రిటన్ చివరకు ఇమ్మిగ్రేషన్ అనేది ఆ దేశ వ్యక్తిగత వ్యవహారం అని చెప్పింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు ట్రంప్‌కు మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే.
జర్మనీ..
జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ స్పందిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాడటాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని, అయితే, ఓ ప్రాంతంలోని ప్రజలను బట్టి దానిని నిర్ణయించవద్దని అన్నారు. ముఖ్యంగా మతాలవారిగా చూడొద్దని చెప్పారు.
ఫ్రాన్స్..
ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ మార్క్ ఐరాల్ట్ కూడా స్పందిస్తూ 'శరణార్థులను స్వాగతించడమనేది సంఘీభావానికి చిహ్నంలాంటిది. ఉగ్రవాదానికి ఒక జాతి అంటూ లేదు. వివక్ష ఎప్పటికీ సమాధానం అనిపించుకోదు' అని అన్నారు.
కెనడా..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడు స్పందిస్తూ 'సంరక్షణ అనేది శరణార్ధులను స్వాగతించడానికి కావాల్సిన ముఖ్యమైన అంశం. ఉగ్రవాదం, యుద్ధం, మతహింస పేరిట ఎవరైతే హింసకు గురవుతున్నారో వారందరికీ కెనడా స్వాగతం పలుకుతోంది.
ఆస్ట్రేలియా..
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ స్పందిస్తూ 'సరిహద్దు దాటి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం ప్రతి దేశనికి చాలాముఖ్యమైన అంశం' అని అన్నారు. సరిహద్దు రక్షణపై ఆయన ఆదివారం ట్రంప్‌తో మాట్లాడారు. ట్రంప్ బ్యాన్ నేరుగా సమర్ధించిన వారిలో ఈయనా ఒకరు.
నిషేధానికి గురైన కొన్ని దేశాల ప్రతిస్పందనలు.....
యెమెన్..
యెమెన్ డిప్యూటీ ప్రధాని అబ్దెల్ మాల్ అల్ మెక్లాఫీ స్పందిస్తూ.. 'నిషేధం అనేది న్యాయపరిష్కారం కాదు. ఇది ఉగ్రవాదులకు మద్దతిచ్చినట్లు.. ప్రజల మధ్య విభేదాలు తెచ్చినట్లు' అన్నారు.
సుడాన్..
అమెరికాలో జీవిస్తున్న సుడాన్ ప్రజలంతా కూడా మంచి ప్రవర్తనకు మారుపేరు. అమెరికా చట్టాలు గౌరవిస్తారు. నేర సంఘటనల్లో, జాతిపరమైన దాడుల విషయంలో మా ప్రజలు ఉండరు' అని సుడాన్ విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పారు.
ఇరాన్..
'ట్రంప్ చేసింది ముమ్మాటికి అవమానాకరమైన చర్యే. ఉగ్రవాదులకు ఇదొక బహుమానంలాంటిది. అమెరికాలో నిషేధ ఆజ్ఞలు ఎత్తి వేసే వరకు మేం మా దేశ పౌరులకోసం కూడా గట్టి భద్రత చర్యలు తీసుకుంటాం. అది అమెరికా పౌరుల విషయంలో కూడా' అని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.
దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి
(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)
(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్)
(ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు)
(ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!)
(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)
(ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?)
(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)
(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)
(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)