ban on Muslims
-
ట్రంప్‌కు అడ్డొస్తే అంతే: అటార్నీ జనరల్‌పై వేటు
వాషింగ్టన్: ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రానీయకుండా జారీచేసిన ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిషేధాజ్ఞల విషయంలో ప్రభుత్వానికి సహకరించడం లేదన్న కారణంతో తాత్కాలిక అటార్నీ జనరల్ (న్యాయ శాఖ అధిపతి) సలే యాట్స్ను పదవి నుంచి తొలగించారు. ‘అమెరికన్ల ప్రయోజనం కోసం జారీ అయిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సమర్థించకుండా ఆమె(సలే యాట్స్) విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. అందుకే ఆమెను పదవిననుంచి తొలిగించాం’అని వైట్‌హౌస్ అధికారులు సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. వర్జీనియా అటార్నీగా పనిచేస్తోన్న డనా బౌంటేను నూతన (తాత్కాలిక )అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ప్రమాణం చేశారు. ముస్లిం దేశాలపై ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులను ఫెడరల్ కోర్టులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ న్యాయశాఖ వాదనలు వినిపించాల్సిఉంది. అయితే సలే యాట్స్ మాత్రం ట్రంప్ నిషేధ నిర్ణయానికి అనుకూలంగా వాదించబోనని మొండిపట్టుదల ప్రదర్శించారు. ట్రంప్‌ను సమర్థించవద్దంటూ సహచర లాయర్లకు లేఖలు కూడా రాశారు. అటార్నీ జనరల్ పదవిలోఉండి ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సలేను పదవినుంచి తొలిగించిన కొద్దిసేపటికే ఈ వ్యవహారంపై ట్రంప్ ట్వీట చేశారు. ‘ఒబామాచేత నియమితురాలైన అధికారులు మా పనికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు’అని సలే యాట్స్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులను 90 రోజులపాటు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పలు ఫెడరల్ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. నాలుగు కోర్టులైతే ఏకంగా ఉత్తర్వులనే నిలుపుదలచేస్తూ తీర్పులిచ్చాయి. అటార్నీ జనరల్ నేతృత్వంలోని లాయర్లు.. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వాదలను వినిపించాల్సిఉంటుంది. ఆపని చేయని కారణంగా సలే యాట్స్పై వేటుపడింది. (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) -
నోరు విప్పిన ప్రపంచ నేతలు
న్యూయార్క్: ఏడు దేశాల ముస్లింలు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు స్పందించారు. ఇప్పటికే ఆయా దేశాల్లోని ప్రజలు, టెకీలు, యువత, అమెరికాకు చెందినవారే స్వయంగా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతుండగా తొలిసారి కొన్ని దేశాలకు చెందిన నేతలు స్పందించారు. ఆ ప్రతిస్పందనలు ఒకసారి పరిశీలిస్తే... బ్రిటన్.. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ట్రంప్ నిర్ణయంపై స్పందిస్తూ ముస్లింలపై నిషేధించడమనేది 'ఓ విభజన, తప్పు' అని చెప్పగా ఇలాంటి నిర్ణయం సిగ్గుచేటు, క్రూరమైన చర్య అని లండన్ మేయర్ చెప్పారు. అయితే, ఇలాంటి వాటిని తాము అంగీకరించబోమని చెప్పిన బ్రిటన్ చివరకు ఇమ్మిగ్రేషన్ అనేది ఆ దేశ వ్యక్తిగత వ్యవహారం అని చెప్పింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు ట్రంప్‌కు మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. జర్మనీ.. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ స్పందిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాడటాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని, అయితే, ఓ ప్రాంతంలోని ప్రజలను బట్టి దానిని నిర్ణయించవద్దని అన్నారు. ముఖ్యంగా మతాలవారిగా చూడొద్దని చెప్పారు. ఫ్రాన్స్.. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ మార్క్ ఐరాల్ట్ కూడా స్పందిస్తూ 'శరణార్థులను స్వాగతించడమనేది సంఘీభావానికి చిహ్నంలాంటిది. ఉగ్రవాదానికి ఒక జాతి అంటూ లేదు. వివక్ష ఎప్పటికీ సమాధానం అనిపించుకోదు' అని అన్నారు. కెనడా.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడు స్పందిస్తూ 'సంరక్షణ అనేది శరణార్ధులను స్వాగతించడానికి కావాల్సిన ముఖ్యమైన అంశం. ఉగ్రవాదం, యుద్ధం, మతహింస పేరిట ఎవరైతే హింసకు గురవుతున్నారో వారందరికీ కెనడా స్వాగతం పలుకుతోంది. ఆస్ట్రేలియా.. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ స్పందిస్తూ 'సరిహద్దు దాటి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం ప్రతి దేశనికి చాలాముఖ్యమైన అంశం' అని అన్నారు. సరిహద్దు రక్షణపై ఆయన ఆదివారం ట్రంప్‌తో మాట్లాడారు. ట్రంప్ బ్యాన్ నేరుగా సమర్ధించిన వారిలో ఈయనా ఒకరు. నిషేధానికి గురైన కొన్ని దేశాల ప్రతిస్పందనలు..... యెమెన్.. యెమెన్ డిప్యూటీ ప్రధాని అబ్దెల్ మాల్ అల్ మెక్లాఫీ స్పందిస్తూ.. 'నిషేధం అనేది న్యాయపరిష్కారం కాదు. ఇది ఉగ్రవాదులకు మద్దతిచ్చినట్లు.. ప్రజల మధ్య విభేదాలు తెచ్చినట్లు' అన్నారు. సుడాన్.. అమెరికాలో జీవిస్తున్న సుడాన్ ప్రజలంతా కూడా మంచి ప్రవర్తనకు మారుపేరు. అమెరికా చట్టాలు గౌరవిస్తారు. నేర సంఘటనల్లో, జాతిపరమైన దాడుల విషయంలో మా ప్రజలు ఉండరు' అని సుడాన్ విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పారు. ఇరాన్.. 'ట్రంప్ చేసింది ముమ్మాటికి అవమానాకరమైన చర్యే. ఉగ్రవాదులకు ఇదొక బహుమానంలాంటిది. అమెరికాలో నిషేధ ఆజ్ఞలు ఎత్తి వేసే వరకు మేం మా దేశ పౌరులకోసం కూడా గట్టి భద్రత చర్యలు తీసుకుంటాం. అది అమెరికా పౌరుల విషయంలో కూడా' అని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..
న్యూయార్క్: ఆగ్రహంతో అమెరికా ప్రజలు చేస్తున్న అరుపులకు ఆ దేశ దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. ధర్నా చౌరస్తాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, ముఖ్యంగా రెండో రోజు కూడా విమానాశ్రయాల ప్రాంగణాలు నిరసన నినాదాలతో మారుమ్రోగిపోతున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం ఎక్కి పట్టుమని పది రోజులు కూడా కాకమునుపే ప్రజలకు నిద్రలేకుండా చేయడంతో వారు మండిపడుతున్నారు. రోజుకో కొత్త నిర్ణయంతో హడలెత్తిస్తుండటంతో అంతా తమ నివాసాలు విడిచి రహదారుల బాటపట్టారు. మొత్తానికి అమెరికానే ముందు.. ఆ తర్వాతే ఎవరైనా అని పేర్కొంటూ ఏకంగా అణుబాంబంత ప్రజావ్యతిరేకతను ట్రంప్ మూటకట్టుకుంటున్నారు. వీసా నిబంధనలు పునరుద్ధరించే మరో 90 రోజులుపాటు ఏడు దేశాల ముస్లింలకు అమెరికాలోకి ప్రవేశం లేదంటూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోగా 'ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. వలసదారులు, శరణార్థులు అమెరికాకు నిర్భయంగా రావొచ్చు' అంటూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆహ్వానిస్తున్నారు. అమెరికాలో ఆదివారం విమానాశ్రయాల లోపల మొత్తం ఖాళీ ఏర్పడగా.. బయటమాత్రం వేలమందితో కిక్కిరిసిపోతున్నాయి. అది కూడా ట్రంప్ వ్యతిరేక ఆందోళనలతో. దాదాపు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలన్నీ కూడా ఆందోళనలకు నిలయాలుగా మారాయి. లాస్ ఎంజెల్స్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, డల్లాస్, న్యూయార్క్ జేఎఫ్ కెన్నడీ, రాలేగ్, హ్యూస్టన్, సీటెల్, పోర్ట్లాండ్, అట్లాంటాతోపాటు పలు విమానాశ్రయాల్లోని టర్మినల్స్ వద్దకు వేలల్లో చేరిన పౌరులు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజు ఎలాగైతే ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీలు తీశారో అచ్చం అలాగే తాజాగా చేస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ కూడళ్లు, వైట్ హౌస్ వద్ద, బోస్టన్ కోప్లీ స్క్వేర్, మన్ హట్టన్‌లోని బ్యాటరీ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక్కో పార్క్ వద్ద దాదాపు పదివేలమంది పోగై నిరసనలు తెలియజేస్తున్నారు. 'ద్వేషం లేదు.. భయం లేదు.. వలసదారులు మేం స్వాగతం పలుకుతున్నాం' అంటూ గీతాలుగా ఆలపించారు. ఇప్పటికే వచ్చి విమానాశ్రయాల్లోనే ఇరుక్కుపోయిన వారిపట్ల సానుభూతి ప్రకటిస్తూ సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శనివారం నిర్భందించిన ఇద్దరు ఇరాకీయులను విడిచిపెట్టారు. ప్రస్తుతానికి అన్ని విమానాశ్రయాల వద్ద ఆందోళన జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగడం లేదు.శాంతియుత వాతావరణంలోనే ఆందోళనలు చేస్తున్నారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా? ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో! వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా 'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం' -
ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్
వాషింగ్టన్: ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిల్లిమొగ్గవేశారు. ‘ఇది ముస్లింలపై నిషేధంకాదు.. ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశాలను మీడియా వక్రీకరించింది’ అని వాపోయారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన నష్టనివారణచర్యలకు దిగారు. ‘ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా.. కార్యనిర్వాహక ఉత్తర్వులు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్) అంటే ముస్లింలపై నిషేధం విధించినట్టు కానేకాదు. ఉత్తర్వుల సారాంశాన్ని మీడియా వక్రీకరించింది. నిజానికి ఈ ఉత్తర్వులు మత సంబంధమైనవి కావు. అమెరికన్ల భద్రత, ఉగ్రవాదం అంశాలనే ప్రాతిపదికగా తీసుకున్నాం. ‘అమెరికా ఫస్ట్’ అనేది మా విధానం. అమెరికన్ల భద్రత విషయంలో రాజీపడేది లేదు. అయినా, ఆ ఏడు దేశాలను మినహాయిస్తే, ప్రపంచంలో ముస్లిం మెజారిటీ ఉన్న దాదాపు 40 దేశాలకు మా నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. 90 రోజుల్లో వీసాల జారీ ప్రక్రియను మరింత పకడ్బందీ చేస్తాం. అప్పుడు అన్ని దేశాలకు చెందిన పౌరులను అమెరికాలోకి ఆహ్వానిస్తాం’ అని ట్రంప్ చెప్పారు. (ట్రంప్‌కు టిట్ ఫర్ టాట్: ఇరాన్ సంచలన నిర్ణయం) ఒబామా బాటలోనే నేనూ.. ముస్లిం దేశాలపై నిషేధం విధించడం కొత్తేమీ కాదన్న ట్రంప్.. బరాక్ ఒబామా హయాంలోనూ అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నదని గుర్తుచేశారు. ‘ఒబామా, 2011లో ఇరాకీయుల ప్రవేశంపై ఆరునెలలపాటు విధించారు. ఇప్పటి కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పేర్కొన్న ఏడు దేశాలు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నాయని నిర్ధారించింది కూడా ఒబామా సర్కారే’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. సిరియా మారణహోమంలో నలిగిపోతున్న వారిపట్ల తాను కూడా చింతిస్తున్నానని, అంతమాత్రనా అమెరికన్ల భధ్రతను పణంగాపెట్టి శరణార్థులను ఆహ్వానించబోనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అన్నింటికంటే ముందు అమెరికాను సురక్షితంగా చేసిన తర్వాతే శరణార్థుల సమస్యల పరిష్కారానికి నడుం కడతామని వ్యాఖ్యానించారు. ‘అవును. అమెరికా ఒక వలసదేశమే. కానీ శరణార్థుల కంటే అమెరికన్ల భద్రతే నాకు ముఖ్యం’అని ట్రంప్ స్పష్టం చేశారు. (ఒకసారి అమెరికాను వీడితే.. మళ్లీ వెళ్లడం కుదరదు!)