ఎక్స్-కిరణాల గుట్టురట్టు!
వాషింగ్టన్: విశ్వవ్యాప్తంగా ప్రసరిస్తున్న ఎక్స్-రే కిరణాలకు మూలాధారం ఒక్కటి కాదని అమెరికా శాస్త్రవేత్తలపరిశోధనలో వెల్లడైంది. సౌర గాలులు, లోక్ హాట్ బబుల్‌గా పిలిచే శక్తి కేంద్రం నుంచి మాత్రమే ఎక్స్-రే కిరణాలు వెలువడుతున్నాయని గత కొన్ని దశాబ్దాలుగా భావిస్తున్నారు. కానీ, పరిశోధకులకు తెలియని ప్రాంతం నుంచీ ఎక్స్-రే కిరణాలు వెలువడుతున్నాయని, ‘డీఎక్స్‌ఎల్’ సౌండింగ్ రాకెట్ పంపిన సమాచారాన్ని క్రోడీకరించాక పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
ముఖ్యంగా శక్తివంతమైన ఎక్స్-రే కిరణాలు మరేదో ప్రాంతం నుంచి వస్తున్నాయని ధ్రువీకరించారు. పాత సిద్ధాంతంలో మార్పులు చేయాల్సిన అవసరముందని మియామి వర్సిటీ శాస్త్రవేత్త గలేజ్ తెలిపారు. మన సౌరవ్యవస్థ ఆవల విస్తరించి ఉన్న ‘ లోకల్ హాట్ బబుల్’ ప్రాంతం నుంచి వెలువడే ఎక్స్-రే కిరణాలపై పరిశోధన నిమిత్తం ‘డీఎక్స్‌ఎల్’ సౌండింగ్ రాకెట్‌ను 2012లో నాసా ప్రయోగించింది.