
ఉగ్రవాదిని గిటార్‌తో కొట్టి ఆపేశాడు!
ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో ఒక దొంగను వయొలిన్‌తో తలమీద కొడతాడు.. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరంలో జరిగింది. వరుసపెట్టి జనాన్ని కత్తితో పొడుచుకుంటూ వెళ్తున్న ఓ ఉగ్రవాదిని 26 ఏళ్ల యువకుడు తన చేతిలో ఉన్న ఎకోస్టిక్ గిటార్‌తో తలమీద కొట్టాడు. దాంతో అతడు ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక ఆగిపోయాడు. ఇషాయ్ మాంట్‌గోమరీ అనే యువకుడు బీచ్‌లో గిటార్ వాయిస్తుండగా అతడికి కొందరి అరుపులు వినిపించాయి. కాసేపటికి బషర్ మాసల్హా (22) అనే వ్యక్తి చాకు పట్టుకుని తనవైపు పరిగెడుతూ రావడం చూశాడు. వెంటనే రెండో ఆలోచన లేకుండా తన చేతిలో ఉన్న గిటార్‌తో అతడి తలమీద ఒక్కటిచ్చుకున్నాడు. దాంతో స్టన్ అయిన మాసల్హా అక్కడే ఆగిపోయాడు. అప్పటికే అతడు ఓ అమెరికన్ పర్యాటకుడిని చంపి, మరో 12 మందిని గాయపరిచాడు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో పోలీసులు అతడిని కాల్చి చంపేశారు.
అయితే.. మరింతమంది మీద ఆ ఉగ్రవాది దాడి చేయకుండా ఆపి.. తన గిటార్ పోగొట్టుకున్న యువకుడి సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. అతడు కొత్త గిటార్ కొనుక్కోడానికి డబ్బులు కూడా వచ్చాయి. మాంట్‌గోవరీని అందరూ గిటార్ హీరో అని ప్రశంసించి, ఇప్పటికి వెయ్యి డాలర్లు ఇచ్చారు. మరో 500 డాలర్లు వస్తే అతడు కొత్త గిటార్ కొనుక్కోవచ్చు. ఓ దాత అయితే 5 డాలర్లు ఇవ్వడమే కాక, తానే కొత్త గిటార్ కొనిస్తానని చెప్పి, తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓ మహిళ తన వద్ద ఉన్న గిటార్‌ను అతడికి ఇచ్చేస్తానని చెప్పారు. మరో మహిళ.. గిటార్ తయారీ కంపెనీ గిబ్సన్ వాళ్లు ఉచితంగా అతడికి కొత్త గిటార్ ఇవ్వాలని అన్నారు.