![Diwali Special Article About Bommala Kolu - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/22/Bommala-kolu.jpg.webp?itok=WQ3k54A-)
చీకట్లను చీల్చి వెలుగునిచ్చే పండుగగా దీపావళిని జరుపుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే. దీపావళి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో బొమ్మలకొలువును ఆనవాయితీగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ బొమ్మల కొలువు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఈతరం పిల్లలకు భారతీయ ధర్మం పట్ల అవగాహన, అభిరుచిని పెంపొందింస్తారు. అలాగే పురాణ, ఇతిహాసాలను కథల రూపంలో పిల్లలకు తెలియజేస్తూ భారతీయ సంప్రదాయంపై గౌరవం కలిగేలా చూస్తారు. బొమ్మల కొలువును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. నరక చతుర్దశి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేసి దీపావళి మరుసటి రోజు సాయంత్రం వరకు దీనిని నిర్వహిస్తారు.
బొమ్మలు కొలువు పెట్టే విధానం :
బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది. బొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు.
గౌరమ్మ పూజ అనంతరం కలశం ఏర్పాటు చేసి తమ వద్ద ఉన్న వివిధ బొమ్మలను వరుస క్రమంలో అలంకరిస్తారు. అనంతరం చక్కెర పొంగలి, పేనీలు, పసుసు, కుంకుమ నైవేద్యంగా సమర్పిస్తారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ పండులను బొమ్మలకొలువు రూపంలో ఏర్పాటు చేసి వాటి విశిష్టతను తమ పిల్లలకు కథల రూపంలో వివరిస్తారు. తమ చుట్టపక్కల ఉండే మహిళలను, పిల్లలను పిలిచి తమ బొమ్మల కొలువును చూపి వారికి వాయినాన్ని అందజేస్తారు. దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవి పూజను నిర్వహించి బొమ్మల కొలువు చుట్టూ దొంతులనూ ఏర్పాటు చేసి నువ్వులనూనెతో మాత్రమే దీపాలను వెలిగిస్తారు. ఇక మూడో రోజున ఐదుగురు ముల్తైదలను పిలిచి వారికి పసుపు, కుంకుమలను వాయినంగా సమర్పించి , అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడంతో కార్యక్రమం ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment