రెండు దేశాలు అల్లిన జీవితం | Nidhi Chhanani Pashmina Graphic Novel Minutely | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 2:25 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM

Nidhi Chhanani Pashmina Graphic Novel Minutely - Sakshi

తల్లి, ‘ఇండియా సురక్షితమైనది కాదు...అక్కడుండే ఆడపిల్లలకి అమెరికాలో ఉన్నంత స్వేచ్ఛ ఉండదు’ అన్న నెపాలు చెప్తుంది.

మనం మార్చలేని సంగతులని అంగీకరించడం నేర్చుకోవాలని చెప్పే ఈ పుస్తకంలో, జీవితం మీద ఆశ, ప్రేమ మెండుగా కనబడతాయి.

గ్రాఫిక్‌ నవలలూ, ఆర్ట్‌ పుస్తకాలూ సాహిత్య ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళే ప్రేరణని కల్పిస్తాయి. 2017లో వచ్చిన గ్రాఫిక్‌ నవల ‘పష్మీనా’, కార్టూనిస్ట్‌ నిధి ఛనానీ రాసినది. దీనిలో ఇండియన్‌ అమెరికన్‌ అయిన టీనేజర్‌ ప్రియాంకా (ప్రి) దాస్‌కు కామిక్స్‌ అంటే ప్రాణం. తల్లితో పాటు ఉంటుంది. వొంటరితనం ఇష్టపడుతుంది. ధార్మికురాలైన తల్లి సంవత్సరాల కిందట ఇండియా వదిలి కాలిఫోర్నియా ఎందుకు వచ్చేసిందో, తన తండ్రి ఎవరో, ఇండియా ఎలా ఉంటుందో! అన్న ప్రశ్నలడుగుతూ తల్లిని సతాయిస్తుంటుంది. తన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంపేసుకున్న తల్లి, ‘ఆ విషయం ఇంక శాశ్వతంగా ముగిసిపోయింది’ అంటూ, ప్రితో ఏ విషయమూ చర్చించదు. అందువల్ల తల్లి మాతృభూమిని ప్రి కేవలం ఊహించుకోగలుగుతుందంతే.

ఒకరోజు తల్లి పాత పెట్టెలో బంగారు దారాలతో అల్లిన ఒక పష్మీనా శాలువ ప్రికి కనబడుతుంది. దాన్ని భుజంమీద వేసుకున్న వెంటనే ప్రి, హిందూ దేవత ‘శక్తి’ సహాయంతో తన పగటి కలల భారతదేశంలోకి అడుగు పెడుతుంది. మాట్లాడే ఒక ఏనుగూ, ఒక పక్షీ ప్రికే కాక పాఠకులకు కూడా పండుగల, వంటకాల గురించి పరిచయం చేస్తాయి. అవి దారి చూపిస్తుండగా కొబ్బరికాయ పచ్చడీ, సీతాఫలాలూ, రాజభవనాలూ చూసినప్పుడు, ‘ఇక్కడ అన్నీ ఎంత భిన్నంగా, అందంగా ఉన్నాయో’ అనుకుంటుంది ప్రి. అప్పుడు, వాస్తవమైన దేశాన్ని చూడాలన్న కోరిక పుడుతుంది. 

మొదట తల్లి, ‘ఇండియా సురక్షితమైనది కాదు... నా వద్ద నిన్ను ఇండియా పంపడానికి డబ్బు లేదు... అక్కడుండే ఆడపిల్లలకి అమెరికాలో ఉన్నంత స్వేచ్ఛ ఉండదు’ అన్న నెపాలు చెప్తుంది. అవి అతిశయోక్తులనిపిస్తాయి ప్రికి. ఆ తరువాత, కామిక్‌ కార్టూన్ల పోటీలో 500 డాలర్లు గెలుచుకున్న ప్రిని అయిష్టంగానే గర్భవతి అయిన తన చెల్లెలి వద్దకి పంపుతుంది తల్లి. 

అమెరికాలో ప్రి శాలువ కప్పుకున్నప్పుడు ప్రతీదీ– అందంగా, మిలమిల్లాడే రంగుల్లో కనిపిస్తుంది. ఇండియాలో శాలువ తీసెయ్యగానే వ్యాఖ్యాచిత్రాలు అధికంగా– నలుపు, తెలుపు, గ్రే రంగుల్లోకి మారుతాయి. ఒకసారి పష్మీనా తయారు చేసిన వ్యక్తిని కూడా వెతకడానికి ప్రయత్నిస్తుంది. కలల దేశం కాక నిజమైన ఇండియా చూసి వచ్చిన కూతురికి తల్లి కొన్ని నిజాలని తెలియజేసిన తరువాత, రెండు సంస్కృతులనీ గౌరవించడం నేర్చుకుంటుంది ప్రి.

భారతదేశంలో ఉండే స్త్రీల ఎంపికల గురించీ, నిర్భయంగా బతకడం గురించీ తెలుసుకుంటుంది. రచయిత్రి రెండు సంస్కృతులకీ మధ్య గడిపే వలసదారుల జీవితాలని చూపిస్తూనే, ఇండియాలో పితృస్వామ్యం స్త్రీలని ఎంతగా అణగదొక్కిందో అని నాటకీయంగా చూపిస్తారు. రెండు సంస్కృతుల్లో ఇమిడే ప్రయత్నం చేయడంలో ఎదుర్కొన్న కష్టాల వల్ల, తనని తాను తెలుసుకోవడం గురించిన నవల ఇది. 

మొదటి ఇండియన్‌ అమెరికన్‌ రచయిత్రి రూపొందించిన అద్భుతమైన సాహసకృత్యపు గ్రాఫిక్‌ కథ ఇది. మనం మార్చలేని సంగతులని అంగీకరించడం నేర్చుకోవాలని చెప్పే ఈ పుస్తకంలో, జీవితం మీద ఆశ, ప్రేమ మెండుగా కనబడతాయి. ఒక అంశం నుండి మరొకదానికి గెంతుతూ కనిపించే నవల్లో చాలా మట్టుకు ప్రశ్నలు సంబోధించకుండానే వదిలేసినవి అనిపిస్తాయి. పెద్దలూ, పిల్లలూ కూడా చదవదగిన పుస్తకం. నవల చివర  ఇచ్చిన పదకోశంలో ఛనానీ ఉపయోగించిన భారతదేశపు పేర్ల వివరణ ఉంది. ఇది రచయిత్రి ప్రప్రథమ పుస్తకం.

నిధి ఛనానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement