
త్వరలో పెళ్లాడనున్న టాప్ డైరెక్టర్
ఇష్క్, మనం, 24 వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సౌండ్ డిజైనర్ శ్రీనిధి వెంకటేశ్(27)ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. చైన్నెలో ఆదివారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
24 సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారని, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని విక్రమ్ కుమార్ సన్నిహితులు వెల్లడించారు. సెప్టెంబర్ లో వీరి పెళ్లి జరిగే అవకాశముందని తెలిపారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ దగ్గర శ్రీనిధి సౌండ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాతే కొత్త సినిమా చేయాలని విక్రమ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తో ఆయన సినిమా చేయనున్నారని సమాచారం.