
ఇమ్రాన్ ఖాన్‌తో ఆమిర్ ఖాన్ (పాత ఫొటో)
సాక్షి, ముంబై : పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావడం లేదని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార వేడుకకు సంబంధించి తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పానీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్పిన ఆమిర్ ఖాన్.. ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. పానీ ఫౌండేషన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
కాగా ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని, అతి పెద్ద పార్టీగా అవతరించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 11న పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తూ సార్క్ దేశాధినేతలతో పాటు, మోదీని, భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. వీరితో ఆమిర్ ఖాన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment