
తల్లికి ఆమె శిలావిగ్ర హ రూపాన్ని సెల్‌ఫోన్‌లో చూపిస్తున్న లారెన్స్
సృష్టికి అమ్మ దైవం అయితే జగతికి తల్లే దైవం.అందుకే అమ్మ ను వించిన దైవం ఉండదు అంటారు. ఇది జగమెరిగిన సత్యం. అయినా ఇప్పుడు అమ్మను ప్రేమించేవారు,గౌరవించేవారు ఎందరుంటారు? అయితే నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ అమ్మను ప్రేమించడమే కాదు పూజిస్తున్నారు. తన మాతృమూర్తికి ఏకంగా ఒక గుడిని కట్టి ఆరాధించనున్నారు. తల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేయడం అన్నది తమిళనాడులోనే,ప్రపంచంలోనే తొలి ప్రయత్నం లారెన్స్‌దే అయ్యింటుంది.అమ్మను ఆరాధించేవారు ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించగలరు.
శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధ్యుడైన లారె న్స్ ఆయనకు ఆల యాన్ని నిర్మించి నిత్యార్చనలు జరిపిస్తున్నారు. అమ్మను అమితంగా ప్రేమించే ఆయన ఇప్పుడు ఆ ఆలయం ఎదురుగా తల్లికి గుడి కట్టిస్తున్నారు. గుడి నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ప్రారంభోత్సవం జరగనుంది.ఆ గర్భగుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారు.తల్లి శిలారూపాన్ని రాజస్థాన్‌లో తయారు చేయిస్తున్నారు.ఆ శిలారూపం ఫొటోను మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం లారెన్స్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనదంటారు. ఆ గాయత్రీదేవి ప్రతిమను అమ్మకు కట్టిస్తున్న గుడి లో ప్రతిష్టించి ఆ ప్రతిమ కింద అమ్మ కణ్మణి శిలావిగ్రహాన్ని నెలకొల్పనున్నాను.తన గర్భంలో తొమ్మిది నెలలు మోసి,పెంచి పోషించిన కన్నతల్లికి గుడి కటించాలన్నదే లక్ష్యంగా భావించాను. తల్లి ఘనతను ఈ లోకానికి చాటాలన్నదే ఈ గుడి కట్టించడంలో పరమార్థం.
మా కోసం ఎంతగానో శ్రమించిన అమ్మకు గుడి కట్టించడం సంతోషంగా ఉంది. ఉదయం వాకింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న అమ్మకు నేను తయారు చేయిస్తున్న తన శిలారూపం ఫొటోను చూపించగా అమ్మ ఎంతగానో పరవశించారు.తమ్ముడు ఎల్లిన్ తదితరులలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ మాతృదినోత్సవం సందర్భంగా మా అమ్మకు కట్టిస్తున్న గుడిని ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ అంకితం చేస్తున్నానన్నారు లారెన్స్.