
కన్న తల్లికి ఆలయం
అమ్మకు ఆలయం నిర్మించడం అన్నది అరుదైన విషయం. అయితే కన్నతల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించడం అన్నది బహుశా ప్రపంచంలోనే ఎక్కడ జరిగి ఉండదు. అలాంటిది ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు లారెన్స్ తనకు జన్మనిచ్చిన తల్లి కోసం గుడి కట్టించడానికి సిద్ధం అయ్యారు. ఒక దర్శకుడిగా, నటుడిగా సినీ కళామతల్లికి తన వంతు సేవ చేస్తున్న లారెన్స్ సామాజిక సేవలోనూ ముందున్నారు. ఎందరో అనాథలను చేరదీసి వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నారు. లారెన్స్‌లో దైవభక్తి అధికమే.
శ్రీరాఘవేంద్రస్వామి పరమభక్తుడైన లారెన్స్ ఆయనకు స్థానిక అంబత్తూరులో ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయం నిత్యం భక్తజన సందోహంతో దైవస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ ఆలయ సమీపంలో లారెన్స్ తన మాతృమూర్తి కోసం గుడి కట్టించడానికి సిద్ధమయ్యారు. ఈ గుడి నిర్మాణానికి మాతృదినోత్సవం పురస్కరించుకుని ఆదివారం తన తల్లి కణ్మణి సమక్షంలో శ్రీకారం చుట్టనున్నట్లు లారెన్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కన్నతల్లి జీవించి ఉండగానే ఆమెకు ఆలయం నిర్మిస్తున్న తొలి కొడుకు లారెన్స్ అని చెప్పవచ్చు. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిది అంటారు లారెన్స్.