నాన్నకు ప్రేమతో...
► మంగళూరుకు నటి ఐశ్వర్య రాయ్ రాక
► నేత్రావతి సంగమంలో తండ్రి చితాభస్మం లీనం
మంగళూరు: మాజీ విశ్వసుందరి, ప్రసిద్ధ సినీ తార ఐశ్వర్య రాయ్ శనివారం మంగళూరు సమీపంలో ఉన్న పుత్తూరుకు వచ్చారు. ఆమె తండ్రి కృష్ణరాజ్ రాయ్ మార్చి 17న ముంబైలో మరణించారు. ఆయన చితాభస్మాన్ని తీసుకుని తల్లి వృందా, కూతురు ఆరాధ్య, సోదరుడు ఆదిత్యతో కలిసి వచ్చారు. నేత్రావతి- కుమారధార సంగమంలో తమిళనాడు సంప్రదాయరీతిలో అస్తికలు కలిపి పిండప్రదానం చేశారు.
అంతకు ముందు వారు ఉప్పినగుండి సమీపంలో ఉన్న సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య కుటుంబం స్వస్థలం మంగళూరు అన్నది తెలిసిందే. తండ్రి జ్ఞాపకాలతో ఐశ్వర్య ఆద్యంతం దిగులుగా కనిపించింది. నటీమణి రాక సందర్భంగా ఎయిర్‌పోర్టు, ఆలయాల వద్ద అభిమానుల రద్దీ నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు కల్పించాల్సి వచ్చింది.