హిందీలో... అతిథిగా!
బన్నీగా అందరూ పిలుచుకొనే అల్లు అర్జున్ మంచి డాన్సింగ్ స్టార్. ఆయన స్టెప్పులు వేసే విధానం చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఆ స్టయిల్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక, మన బన్నీ ఎంత మంచి డాన్సరో ఈ ఏడాది హిందీ ప్రేక్షకులు కూడా చూడనున్నారు. ఓహో.. బన్నీ నటించిన ఏదైనా తెలుగు చిత్రం హిందీలో అనువాదం కానుందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. హిందీ చిత్రం ‘ఎబిసిడి 2’లో బన్నీ ఒక అతిథి పాత్ర చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
తొలి భాగానికి దర్శకత్వం వహించిన రెమో డిసౌజా దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందుతోంది. అందులో లీడ్ రోల్ చేసిన ప్రభుదేవా ఈ సీక్వెల్‌లో కూడా ఆ పాత్రను చేస్తున్నారు. ప్రభుదేవా కోసమే బన్నీ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. ఇటీవల బన్నీ పాల్గొనగా ఆయన పాత్ర చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. బన్నీ డాన్సింగ్ స్కిల్స్‌ని మరోసారి చూపించే విధంగా ఆయన పాత్ర ఉంటుందట.
ఆయన చేసిన పాత్ర పేరు - ఆర్యన్ చౌహాన్. ఇది ఇలా ఉంటే.. అనువాద చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకుని, ‘మల్లూ అర్జున్’ అనిపించుకున్నారు బన్నీ. ఇప్పుడీ స్ట్రయిట్ చిత్రం ద్వారా హిందీలో కూడా అభిమానులను సంపాదించుకుంటారా? ఏప్రిల్ 2న రానున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు హిందీ తెరపై బన్నీని చూడడానికి జూన్ 19 దాకా వేచి చూడాల్సిందే!