
'వాట్ ఏ ఇన్నింగ్స్.. విరాట్ నీకు నా సెల్యూట్'
ముంబయి: తన అద్భుతమైన బ్యాటింగ్తో పొట్టి ప్రపంచ కప్లో భారత్ను ఒంటి చేత్తో సెమీస్కు తీసుకెళ్లిన స్టార్ ఇండియన్ బ్యాట్స్మెన్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. కోహ్లీ ఆట తీరుపట్ల బాలీవుడ్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, అమిర్ ఖాన్ ముగ్దులైపోయారు. కోహ్లీ నిజంగా ఓ జీనియస్ అని అమితాబ్ తమకు ఇలాంటి ఆనందకరమైన రాత్రులను మరిన్ని ఇవ్వాలని కోరారు. ఇక అమిర్ ఖాన్ అయితే.. ఒకేసారి తనకు మారథాన్, చెస్, ఆర్చరీ చూసినట్లనిపించిందని, కోహ్లీకి నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఆరు వికెట్లతో ఆస్ట్రేలియాను భారత్ మట్టి కరిపించి సెమీస్ కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఇందులో అత్యంత కీలక పాత్రను కోహ్లీ పోషించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచ స్థాయి ప్రశంసలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బాలీవుడ్ సూపర్ హీరోలు స్పందించారు. 'వాట్ ఏ ఇన్నింగ్స్.. విరాట్ నీకు నా వందనం. మారథాన్, చదరంగం, ఆర్చరీల కలయికను ఒకేసారి చూసినట్లుంది' అంటూ ట్వీట్ చేశారు. విరాట్ నీవు చాలా జీనియస్.. సమయానికి తగినట్లు వ్యవహరించడంలో నిజంగా నీవి అద్భుతమైన తెలివితేటలు. ఈ రాత్రిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి రాత్రులు మనకు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను' అని అమితాబ్ ట్వీట్ చేశారు.