
ముంబై : లెజెండరీ నటుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ దశాబ్దాల తరబడి సినీ ప్రియులను అలరిస్తూ హిందీ సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తిచేసుకున్నారు. 1969లో సాథ్ హిందుస్తానీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అమితాబ్ తన నటనతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ అమితాబ్ నటనకు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. సుదీర్ఘ సినీ పయనంలో పలు బ్లాక్‌బస్టర్లు అందించిన అమితాబ్ తన నట ప్రస్ధానం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్ ఎంట్రీ సీన్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందంటే అతిశయోక్తి కాదు.
బిగ్‌బీ తొలి మూవీ సాథ్ హిందుస్తానీ 1969 నవంబర్ 7న విడుదలై 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న అమితాబ్ తన నటవారసునిగా అభిషేక బచ్చన్‌ను పరిశ్రమకు అందించారు. అమితాబ్ 50 ఏళ్ల సినీ ప్రస్ధానం సందర్భంగా ఆయన కుమారుడు అభిషేక్ తన తండ్రి హీరోగా ఎదిగిన తొలినాళ్ల ఫోటోను పోస్ట్ చేశారు. కేవలం కుమారుడిగానే కాదు..నటుడిగా..ఓ అభిమానిగా మేమంతా మీ ఔన్నత్యానికి సాక్షులుగా నిలిచామని అభిషేక్ రాసుకొచ్చారు. సినీ అభిమానులంతా తాము బచ్చన్ తరంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటారని, 50 ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు అభినందనలు తెలిపారు. మరో 50 ఏళ్ల కోసం తాము నిరీక్షిస్తామని అభిషేక్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment