‘‘ఇంకొన్ని గంటల్లో విమానం బయలుదేరుతుందనగా హడావిడిగా మా పెళ్లి జరిగింది. పెళ్లయిన వెంటనే మేం లండన్ వెళ్లాం’’ అన్నారు అమితాబ్ బచ్చన్. సోమవారం అమితాబ్, జయా బచ్చన్‌ల 46 వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా తమ పెళ్లి నాటి విశేషాలను అమితాబ్ గుర్తు చేసుకున్నారు. 1973 జూన్ 3న వీరి పెళ్లి జరిగింది. అమితాబ్, జయ నటించిన ‘జంజీర్’ విడుదలై అప్పటికి దాదాపు 20 రోజులు. ఆ విషయం గురించి అమితాబ్ చెబుతూ– ‘‘జంజీర్’ విజయం సాధిస్తే లండన్ వెళ్లాలని కొంతమంది స్నేహితులం అనుకున్నాం.
ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అందరం లండన్ ప్రయాణం అయ్యాం. మా నాన్న హరివన్ష్ రాయ్ బచ్చన్ దగ్గర లండన్ ట్రిప్ గురించి చెబితే ‘జయ కూడా మీతో వస్తోందా?’ అని అడిగారు. అవునన్నాను. ‘ఒకవేళ మీ ఇద్దరూ కలిసి ట్రిప్ వెళ్లాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లండి’ అన్నారు. అంతే.. అప్పటికప్పుడు మా పెళ్లి నిశ్చయమైంది. మర్నాడు రాత్రి మా లండన్ ఫ్లయిట్. పెళ్లి అనుకోగానే పురోహితులకు చెప్పారు. మా రెండు కుటుంబాలు, కొందరు సన్నిహితుల మధ్య మేం పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత లండన్ ఫ్లయిట్ ఎక్కాం. నేను లండన్ వెళ్లడం అదే మొదటిసారి. జయాకి కూడా ఫస్ట్ టైమే’’ అన్నారు.
పెళ్లి వేదికకు అమితాబ్ వెళ్లే ముందే సన్నగా చినుకులు పడ్డాయట. ఆ విషయం గురించి కూడా అమితాబ్ చెబుతూ – ‘‘పెళ్లికి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించాను. ముంబైలోని మలబార్ హిల్ దగ్గర మా పెళ్లి కోసం మంగళ్ అనే ఇంటిని అద్దెకు తీసుకున్నాం. మా ఇంటి నుంచి అక్కడికెళ్లడానికి నేను కారు ఎక్కాను. డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాను. నా డ్రైవర్ నగేశ్ నేను డ్రైవ్ చేస్తానన్నాడు. పెళ్లికి గుర్రానికి బదులుగా ఆ కారు అనుకున్నాను. కరెక్ట్‌గా బయలుదేరే సమయానికి చినుకులు మొదలయ్యాయి. మా పక్కింటివాళ్లు ‘ఇంతకన్నా మంచి శకునం ఉండదు. వెళ్లండి’ అన్నారు. వెళ్లాను. కొన్ని గంటల్లో మా పెళ్లి పూర్తయింది. ‘మిస్టర్ అండ్ మిసెస్’ అని ప్రకటించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment