యథార్ధ సంఘటనల ఆధారంగా అమ్మణి
ఆరోహణం వంటి మంచి విలువలతో కూడిన ఉత్తమ కథా చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్. ఓ వైపు నటిగా నటిస్తూనే తన దర్శక తృష్ణను తీర్చుకుంటున్న లక్ష్మీరామకృష్ణన్ దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుందనడానికి ఆమె గత చిత్రాలే సాక్ష్యం. అలాంటి నటి,దర్శకురాలు తాజాగా తెరపై ఆవిష్కరించిన చిత్రం అమ్మణి. టాగ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెణ్.గోవింద నిర్మించిన ఈ చిత్రంలో లక్ష్మీరామకృష్ణన్‌తో పాటు ప్రధాన పాత్రల్లో నితిన్‌సత్య, సుబ్బులక్ష్మి, రోబోశంకర్, జార్జ్‌మరియన్, శ్రీబాలాజీ, రెజిన్ రోస్, సి.రేణుక, ఎస్.అన్న తదితరులు నటించారు.
కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి వీ.శివరాజ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ మాట్లాడుతూ బిడ్డను 10 నెలలు కడుపులో మోసి కన్న తల్లిలా ఉంది తన పరిస్థితి అని పేర్కొన్నారు. అమ్మణి లాంటి చిత్రాలను చేయడానికి చాలా తక్కువ మంది నిర్మాతలు ఉంటారన్నారు. ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెణ్.గోవిందకు కృతజ్ఞలు చెప్పుకుంటున్నానని అన్నారు.
సినిమాలో ఒక్క ఎంటర్‌టెయిన్ మాత్రమే కాకుండా చాలా అంశాలు ఉంటాయన్నారు. అలాంటి చిత్రాలు చేసేటప్పుడు పర్ఫెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమాజంలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం అమ్మణి అని తెలిపారు. ఒక మంచి నవల చదివిన భావన అమ్మణి చిత్రం చూసినప్పుడు తనకు కలిగిందని నిర్మాత వెణ్.గోవింద పేర్కొన్నారు. వాస్తవ సంఘటనలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు.