న్యూస్‌మేకర్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ.
అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.
‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.
ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.
గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు.
ముందడుగును అడ్డుకునే కపట నాటకం
‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్‌లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్‌లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.
‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్‌లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్‌లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది.
మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్‌లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది.
ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్‌ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా.
పెద్ద హిట్
నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్‌లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్‌స్పెక్టర్‌గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.
భారీపోటీలో
ఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది.
ఇది మాకు దక్కిన గౌరవం
ఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.
– కిరణ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment