మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి! | A woman should find the gaps in herself director Kiran Rao comments | Sakshi
Sakshi News home page

మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!

Published Thu, Oct 3 2024 10:13 AM | Last Updated on Thu, Oct 3 2024 10:36 AM

A woman should find the gaps in herself director Kiran Rao comments

‘జెండర్‌ని కాదు పితృస్వామ్య వ్యవస్థను సవాల్‌ చేసేలా సినిమా తీయాలనుకున్నాను’ అన్నారు చిత్ర నిర్మాత, స్క్రీన్‌ రైటర్, దర్శకురాలు కిరణ్‌రావు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో బుధవారం జరిగిన ‘మంథన్‌ సమ్‌వాద్‌’ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు ఆమె. ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ భారతదేశం నుంచి ఆస్కార్‌కి అధికారికంగా నామినేట్‌ అయిన సందర్భంగా జెండర్‌ దృష్టి కోణం నుంచి ఎన్నో విషయాలను పంచుకున్నారు.

‘‘మహిళలు తమలో అంతర్గతంగా ఉండే ఖాళీలను కనుక్కోవాలనే ఆలోచనను ‘లాపతా లేడీస్‌’ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా రెండవ చిత్రం. జెండర్‌ తేడా లేకుండా అందరి నుంచి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.

మెరుగైన కృషి
మహిళల కోసం వారి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే  విషయంలో రచనల పరంగా కొంత లోటు ఉంది. ఈ లోటు ను భర్తీ చేయడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. నా మొదటి సినిమా ‘ధోబీ ఘాట్‌’ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ వర్క్‌ నెక్ట్స్‌ సినిమాను మరింత మెరుగ్గా మార్చింది.

ఆడ–మగ .. వేరుగా చూడను
ఆడవాళ్ల మానసిక వేదనలు, వారికి సంబంధించిన సమస్యలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అయితే, మగవారికి సంబంధించి నవి కూడా అంతకన్నా సెన్సిటివ్‌ గా ఉండటం చూస్తుంటాం. నేను ఆడ–మగ అని జెండర్‌ ప్రకారంగా వీళ్లు తక్కువ, వాళ్లు ఎక్కువ అని చెప్పలేను. మగవాళ్లు కూడా మహిళల కోణం నుంచి సెన్సిటివ్‌ విషయాలను రాయగలరు, చిత్రాలు తీయగలరు. మొన్నామధ్య వచ్చిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ను స్త్రీ కోణం నుంచి పురుష దర్శకుడే మనకు పరిచయం చేశారు. నేను ఒంటరితల్లిగా మా అబ్బాయి మనోభావాలను కూడా గమనిస్తుంటాను కాబట్టి ఆడ–మగ అనే ఆలోచనతో కాకుండా మానవత్వం అనే కోణం నుంచే చూస్తాను.

పితృస్వామ్యాన్ని సవాల్‌ చేస్తూ! 
మహిళల కోణం నుంచి చూస్తే ముఖ్యంగా అమ్మాయిలకు వారి కలలను సాధించుకునే విషయంలో మన దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రధానమైనది పితృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల సొంతంగా ఎదగడం కన్నా, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు. ఆ కోణం నుంచి ఈ ‘లాపతా లేడీస్‌’ కథను చూపించాం. ఇద్దరు నవ వధువులు, భర్తలతో అత్తవారింటికి రైలులో బయల్దేరుతారు. మేలి ముసుగులు నిండా కప్పుకున్న వధువులు ఒక స్టేషన్‌లో దిగాల్సినది మరోచోట దిగుతారు. వాళ్లిద్దరిని ఇళ్లలోని వారు వెతుకుతుంటారు. ఎవరి కంటా పడకుండా ఒక వధువు తనకై తానుగా ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచు కుంటుంది. మరొక వధువు చుట్టూ ఉన్న పితృస్వామ్యాన్ని సవాల్‌ చేస్తుంది. బరువైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన్పటికీ, హాస్యాన్ని కూడా జత చేయడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్రామీణ  ప్రాంతాల్లో చిత్రీకరించాం. వివాహం చేసుకోబోయే యువతులైనా, చదువుకోవడానికి చేసే ప్రయత్నమైనా వాళ్లు ఎదుర్కొనే అనేక రకాల పరిస్థితులు, కొత్త మార్గాన్ని అన్వేషించడానికి, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఆలోచింపజేస్తుంది. మహిళలు వయసు పైబడినవారయినా సరే...మగవారిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంచుకోవాలి’’  అని అన్నారు.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌

 

ఫెమినిజం మెరుపు
‘లాపతా లేడీస్‌’ అని టైటిల్‌ చూసి ఫెమినిజం ఫైర్‌ ఉంటుంది కాబోలు అనుకోలేరు. కానీ, దాని తాలూకు ఒక మెరుపు కనిపిస్తుంది. అందువల్ల మగవారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం పితృస్వామానికి విరుద్ధమే కానీ ఒక జెండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. నేను వివాహ వ్యవస్థకు అస్సలు వ్యతిరేకం కాదు. నిజానికి పెళ్లయినా, కుటుంబంలో అయినా సరే స్త్రీలు తమలోని ఖాళీలను కనుక్కొనేలా ్ర΄ోత్సహించే విధంగా ఈ కథను చెప్పాలనుకున్నాను. అంతేకానీ ఏదో భారీ విప్లవాన్ని తీసుకొచ్చి సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement