‘లాపతా లేడీస్’ పేరు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’గా మారిపోయింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంతా, ఛాయా కందం లీడ్ రోల్స్‌లో నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్ (తప్పిపోయిన మహిళలు అని అర్థం). ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 1న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అలాగే వచ్చే ఏడాది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ చిత్రం నామినేషన్ కోసం ఇండియా అఫీషియల్ ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. కాగా ‘లాపతా లేడీస్’ అనే హిందీ టైటిల్ అంతగా రిజిస్టర్ కాదేమోనని, ఈ సినిమాకు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అమెరికాలోని కొన్ని లొకేషన్స్‌లో ‘లాస్ట్ లేడీస్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు మేకర్స్.
ఈ సందర్భంగా కిరణ్ రావ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘లాస్ట్ లేడీస్’ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం కాబట్టి మహిళలందరూ మా సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కథ విన్న వెంటనే నాకు వినోదాత్మకంగా అనిపించింది. పైగా పలు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. మహిళా సాధికారిత, స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడుతున్న మహిళలకు పురుషులు సపోర్ట్ చేయడం అనే పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఆమీర్‌ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment