దెబ్బ తిన్న సింహంలా తిరిగొచ్చిన సర్కార్
ఆయన యాంగ్రీ యంగ్ మాన్. ఇప్పుడు కాదు.. ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడూ లేనంత మరింత యాంగ్రీగా తిరిగొచ్చాడు. ఎందుకంటే, దెబ్బతిన్న సింహం ఎప్పుడూ మరింత ప్రమాదకరం అవుతుంది. సుభాష్ నాగ్రే కూడా అంతే. సర్కార్ సినిమాల్లో ప్రతి సిరీస్‌కు ఆయన మరింత యాంగ్రీగా కనిపిస్తాడు. వయసు పెరిగేకొద్దీ అమితాబ్ బచ్చన్ ముఖంలో నవరసాలు మరింత ఘాటుగా పలుకుతున్నాయి. రాంగోపాల్ వర్మ తీసిన సర్కార్-3 సినిమా ట్రైలర్ చూస్తే అదే అనిపిస్తుంది. ''గాయపడిన సింహం మరింత ప్రమాదకరం'' అనే మాటలతోనే ఈ సినిమాలో అమితాబ్ ఇంట్రడక్షన్ కనిపిస్తుంది. ఆయన కొడుకులు ఇద్దరూ మరణిస్తారు గానీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గరు. సర్కార్-2 సినిమాలో శంకర్ పాత్ర పోషించిన అభిషేక్ బచ్చన్ ఫొటో గోడకు వేలాడుతుంటుంది. 'దర్ద్ కీ కీమత్ చుకానీ పడ్తీ హై' (బాధ విలువను చెల్లించక తప్పదు) అని అమితాబ్ సింహంలా గర్జిస్తారు.
ఈసారి సర్కార్ సినిమాలో కొత్త పాత్రలు చాలానే కనిపిస్తాయి. సర్కార్ మనవడు శివాజీ పాత్రలో అమిత్ సాద్ కనిపిస్తాడు. గోవింద్ దేశ్‌పాండే పాత్రలో రెబల్‌గా మనోజ్ బాజ్‌పాయి, అను పాత్రలో వెన్నుపోటు పొడిచే హీరోయిన్ యామీ గౌతమ్, వాల్యా అనే పాత్రలో సర్కార్‌కు వ్యతిరేకంగా ఉండే జాకీ ష్రాఫ్.. వీళ్లంతా మనకు కొత్తగానే కనిపిస్తుంటారు. సర్కార్‌కు నమ్మకస్తుడైన సహాయకుడిగా రోనిత్ రాయ్ ఉంటాడు. తుపాకుల మోతలు, ఎప్పటికప్పుడు టెన్షన్.. తప్పనిసరిగా సర్కార్ సినిమాలో ఉండే వినాయక చవితి అన్నీ ఇందులో ఉంటాయి. 'ఈ చేతులతోనే చంపుతా' అనే సుభాష్ నాగ్రే మాటలతో సర్కార్ -3 ట్రైలర్ ముగుస్తుంది. అంటే, దీనికి మరో భాగం కూడా ఉంటుందని అనుకోవాలేమో మరి!! రాంగోపాల్ వర్మ మళ్లీ అమితాబ్‌తో కలిసి తీసిన ఈ సినిమా వెండితెర మీదకు ఎప్పుడు వస్తుందో మాత్రం రాము ఇంకా చెప్పలేదు.