... అండ్ ద హీరో ఈజ్ 2015
2015లో మన హీరోలంతా ఫుల్ జోష్‌తో పని చేశారు. దాదాపుగా అందరు హీరోలూ తమ తమ సినిమాలతో బిజీగానే ఉన్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ల లెక్కలు పక్కన పెడితే...అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలందరూ మునుపటి కన్నా స్పీడ్ పెంచి సినిమాలు చేశారు... చేస్తున్నారు. ఇలా హీరోలంతా బిజీగా ఉంటే పరిశ్రమకే చాలా మంచిది. 2015లో మన హీరోల హంగామా, 2016లో ప్రణాళికల గురించి ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్.
బాక్సాఫీస్ బాహుబలి...
‘బాహుబలి’లో కొడుకు శివుడిగా, తండ్రి అమరేంద్ర బాహుబలిగా రెండు విభిన్న పార్శ్వాలున్న పాత్రల్లో ప్రభాస్ ఈ ఏడాది జేజేలందుకున్నారు. మొత్తం వసూళ్ళలో రికార్డులు తిరగరాశారు. అది సరే కానీ ఇంతకీ, అమరేంద్ర బాహుబలిని అతని సేనాధిపతి కట్టప్ప ఎందుకు చంపినట్లు? అది తెలుసుకోవడానికి రానున్న కొత్త ఏడాదిలో ప్రభాస్ నటించే రెండోభాగం ‘బాహుబలి... ది కన్‌క్లూషన్’ కోసం అందరూ వెయిటింగ్.
శ్రీమంతుడి... బ్రహ్మోత్సవం
తండ్రి సొంత ఊరిని దత్తత తీసుకొని, అభివృద్ధి చేసి, ఆ ఊరి వాళ్ల ప్రేమను సంపాదించే హీరో కథ ‘శ్రీమంతుడు’. ఈ సినిమాతో బాక్సాఫీస్ ‘శ్రీమంతుడు’గా వెలిగారు మహేశ్‌బాబు. ఆ చిత్రకథకు తగ్గట్లుగా తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త ఏడాది శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బ్రహ్మోత్సవం’తో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే, మురుగదాస్‌తో ఓ సినిమా చేయనున్నారు.
సర్దార్ కోసం వెయిటింగ్
పవన్ కల్యాణ్ నటించిన తొలి మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఈ ఏడాది ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో తెరపై కనిపిస్తారని అంతా ఆశించారు. కానీ, ఈ చిత్రం ఆలస్యంగా మొదలైంది. వచ్చే ఏడాది విడుదలవుతుంది.
మళ్లీ సందడి చేశారు
23ఏళ్ల క్రితం రమ్యకృష్ణ-మీనాతో ‘అల్లరి మొగుడు’గా సందడి చేసిన మంచు మోహన్‌బాబు మళ్లీ ఈ నాయికలిద్దరితో ‘మామ మంచు-అల్లుడు కంచు’ చేశారు. కొత్త ఏడాదిలో ఆయన ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారనే వార్త వినిపిస్తోంది.
కొత్త ఏడాదికి ప్రేమతో...
‘టెంపర్’ సినిమాలో లంచగొండి ఆఫీసర్‌గా పూర్తి నెగటివ్ షేడ్స్‌లో కనిపించారు చిన్న ఎన్టీఆర్. చాలా కాలం నుంచి ఊరిస్తున్న సక్సెస్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ మార్కు హీరోయిజమ్‌తో సొంతం చేసుకున్నారు. సుకుమార్ శైలిలో డిఫరెంట్ లుక్‌లో స్టయిలిష్‌గా రేపు సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ అని పలకరించనున్నారు. ఆ తర్వాత శివ కొరటాల దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేయనున్నారు.
క్లాస్‌గా.... వచ్చే ఏడాది మాస్‌గా
తండ్రి గౌరవం కోసం పోరాడే కొడుకుగా, త్రివిక్రమ్ మార్కు ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా అల్లు అర్జున్ సక్సెస్ అందుకున్నారు. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా తరువాత కొత్త ఏడాదిలో మాస్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’గా అల్లు అర్జున్ వస్తున్నారు. ఈ చిత్రంలో రఫ్ అండ్ టఫ్‌గా కనబడుతున్నారు.
ఇప్పుడిక ఫైటింగ్ స్పిరిట్ కావాలి!
‘బ్రూస్‌లీ’లో స్టంట్‌మ్యాన్‌గా తెరపైకొచ్చిన రామ్‌చరణ్ సరికొత్త మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఫైట్స్ చేశారు. కొత్త ఏడాదిలో తమిళంలో ఘనవిజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటించనున్నారు.
కిక్ ఎక్కలేదు గానీ...
ఈ ఏడాది ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ ద్వారా రవితేజ తెరపై కనిపించారు. మొదటి కిక్ ఇచ్చినంత కిక్ రెండో కిక్ ఇవ్వలేదని జనం తీర్పు ఇచ్చేశారు. ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ తర్వాత కొత్త ఏడాదిలో వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎవడో ఒకడు’, చక్రి అనే నూతన దర్శకుని చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆక్సిజన్...
ఈ ఏడాది యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జిల్’, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సౌఖ్యం’లో నటించారు గోపీచంద్. కొత్తగా ‘ఆక్సిజన్’ అనే సినిమా అంగీకరించారు. ఇది కాకుండా మరికొన్ని చిత్రాలను ఫైనలైజ్ చేశారు.
భలే భలే సినిమాలోయ్...
తనను తాను అన్వేషించుకునే యువకుడి పాత్రలో ‘ఎవడే సుబ్రమణ్యం’, మతిమరుపు ఉన్న కుర్రాడిగా ‘భలే భలే మగాడివోయ్’లో.. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రల్లో నాని భేష్ అనిపించుకున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో హను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమాతో ముందుకు వస్తున్నారు. మరో పక్క తనను హీరోగా ఇంట్రడ్యూస్ చే సిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఎప్పటిలానే ‘పండగ చేస్కో’
‘పండగ చేస్కో’ అంటూ ఈ ఏడాది జోష్‌గా కనిపించిన రామ్‌కు, ఆ తర్వాత చేసిన ‘శివమ్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కొత్త ఏడాది మొదటి రోజునే హరి పాత్రలో తన ప్రేయసి శైలజతో ఎదురైన ప్రేమ అనుభవాలను ‘నేను...శైలజ’ అని చెప్పనున్నారు.
మళ్ళీ... మళ్ళీ... రానా
‘బాహుబలి’లో భల్లాలదేవగా, ‘రుద్రమదేవి’లో చాళుక్య వీరభద్రుడిగా మంచి నటన కనబరిచారు రానా. హిందీ చిత్రం ‘బేబీ’లో కీలక పాత్ర, ‘దొంగాట’, ‘సైజ్ జీరో’ చిత్రాల్లో అతిథి పాత్రలు కూడా చేశారు. ప్రస్తుతం ‘బాహుబలి’ సీక్వెల్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లో నటిస్తున్నారు. అలాగే, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న మలయాళ ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో నటిస్తున్నారు.
లవ్... యాక్షన్... మధ్య ఊగిసలాట
లవర్‌బాయ్ ఇమేజ్‌లో నుంచి బయటపడేందుకు యాక్షన్ పంథాలో ముందుకు వెళుతూ నాగచైతన్య చేసిన విభిన్న ప్రయత్నం ‘దోచేయ్’. కొత్త ఏడాదిలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’లో, మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్‌లో నాగచైతన్య కనిపించనున్నారు.
ఇమేజ్ కంచె దాటి...
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సృజనాత్మక దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’లో సైనికుడిగా వరుణ్ ఒదిగిపోయిన వైనాన్ని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ‘లోఫర్’ టైటిల్‌కి తగ్గట్టు అభినయించారు. కొత్త ఏడాదిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా, క్రిష్‌తో మరో సినిమా చేయడానికి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మేనమామ బాటలో...
మేనమామ చిరంజీవిలానే ఉంటారు సాయిధరమ్ తేజ్. ఈ ఏడాది ‘రేయ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ద్వారా తెరపై కనిపించారు సాయిధరమ్. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో మేనమామ చిరంజీవి సూపర్‌హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో..’ పాట రీమిక్స్‌కు ఆయనలానే స్టెప్స్ వేసి, మేనమామకు తగ్గ మేనల్లుడు అనిపించుకున్నారు. కొత్త ఏడాదిలో ఆయన ‘తిక్క’, ‘సుప్రీమ్’ చిత్రాలతో పలకరిస్తారు.
ఎట్టకేలకు... ‘భలే మంచి’ టైమ్!
‘దొంగాట’లో అతిథి పాత్ర, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో విభిన్న తరహా పాత్ర చేశారు సుధీర్‌బాబు. ఆ తర్వాత చేసిన‘మోసగాళ్లకు మోసగాడు’ నిరాశపరి చినా, ఇటీవల శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ‘భలే మంచి రోజు’ వంటి డిఫరెంట్ క్రైమ్, కామెడీ మూవీ ద్వారా ప్రశంసలు అందుకున్నారు. త్వరలో హిందీ చిత్రం ‘భాగీ’లో విలన్‌గా కనిపిస్తారు.
డ్యాన్సులు... ఫైట్లు... ‘ అఖిల్’
అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ కోసం అందరూ ఈ ఏడాది ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు. కొత్త ఏడాదిలో అఖిల్ చేసే మలి చిత్రం ఇంకా చర్చల దశలో ఉంది.
లక్కీ హీరో!
గోదావరి జిల్లా యాసలో పక్కింటి అబ్బాయిలా కనెక్ట్ అయిపోయే రాజ్ తరుణ్‌కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’తో క్రేజీ హీరో అయిపోయారు. ప్రస్తుతం మంచు విష్ణు కాంబినేషన్‌లో ఓ సినిమా, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’లో నటిస్తున్నారు.
సక్సెస్‌ఫుల్ ‘కేరింత’
స్నేహం నేపథ్యంలో ‘కేరింత’, ప్రేమకథాంశంతో ‘కొలంబస్’ చిత్రాలు చేశారు సుమంత్ అశ్విన్. ప్రస్తుతం ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగే ‘రైట్ రైట్ చేస్తున్నారు.
గరమ్ గరమ్‌గా... వస్తున్నాడు!
ఆది ఈ 2015లో తెరపై కనిపించలేదు. దానికి కారణం మదన్ దర్శకత్వంలో రానున్న ‘గరం’ చిత్రానికి శ్రద్ధ తీసుకోవడమే. ఈ కథ నచ్చి, తండ్రితో చర్చించి, సొంతంగా నిర్మించారు. కొత్త ఏడాదిలో ‘గరం’తో, ‘చుట్టాలబ్బాయ్’తో పలకరించనున్నారు.
వచ్చే ఏడాది ఆ అమ్మాయితోనే...
‘బీరువా’, ‘టైగర్’ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ వచ్చే ఏడాది ‘ఒక అమ్మాయి తప్ప’తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.
సర దాగా...
మంచు విష్ణు ‘డైనమైట్’లో సరికొత్త గెటప్‌తో కనిపించారు. 2016లో ‘సరదా’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోనూ, మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.
‘శౌర్య’ం చూపించడానికి...
ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయన దశరథ్ దర్శకత్వంలో ‘శౌర్య’ సినిమా చేస్తున్నారు.
ముచ్చటగా మూడు...
ఈ ఏడాది ‘అల్లరి’ నరేశ్ ‘జేమ్స్‌బాండ్’, ‘బందిపోటు’, ‘మామ మంచు-అల్లుడు కంచు’లో నటించారు. కొత్త చిత్రాలతో రెడీ అవుతున్నారు.
శర్వా ఎక్స్‌రప్రెస్
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి ఫీల్‌గుడ్ మూవీతో అలరించారు శర్వానంద్. కొత్త ఏడాదిలో రానున్న ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లో మాస్ పాత్రలో కనిపిస్తారు.
కొత్త ఏడాది ప్రారంభంలోనే...
‘జాదూగాడు’లో కనిపించిన నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రంతో కొత్త ఏడాదికి శ్రీకారం చుడుతున్నారు. ‘కల్యాణ వైభోగమే’ రిలీజ్‌కి రెడీ. ఇంకా ‘ఒక మనసు’, ‘జో అచ్యుతానంద’ చిత్రాలు చేస్తున్నారు.
ఒకేసారి రెండు సినిమాలతో...
హాస్యనటుని స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగిన సునీల్ ఈ ఏడాది సందడి చేయలేదు. కొత్త ఏడాది ‘కృష్ణాష్టమి’ తదితర చిత్రాల్లో హీరోగా కనిపిస్తారు.
పీపుల్స్ స్టార్ దండకారణ్యం
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఈ ఏడాది ‘రాజ్యాధికారం’లో మూడు పాత్రలు పోషించారు. వచ్చే ఏడాదికి ‘దండ కారణ్యం’ని సిద్ధం చేస్తున్నారు.
ఇటు హీరో.. అటు నిర్మాత...
నితిన్ ఈ ఏడాది ‘కొరియర్ బోయ్ కల్యాణ్’లో నటించారు. ‘అఖిల్’ చిత్రానికి నిర్మాతగా వార్తలోకెక్కారు. కొత్త ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ... ఆ’ చిత్రంలో కనిపిస్తారు
ప్రయోగాలకు సై...
‘సూర్య వర్సెస్ సూర్య’, ‘శంకరాభరణం’ చిత్రాల్లో నిఖిల్ కనిపించారు. ‘టైగర్’ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ చేస్తున్నారు. ఆ తర్వాత ‘కార్తికేయ’ సీక్వెల్ చేయాలని ప్లానింగ్.
ఒకటికి పది...
ఈ ఏడాది ‘అసుర’లో ప్రశంసలు అందుకున్న నారా రోహిత్ వచ్చే ఏడాది దాదాపు పది చిత్రాల్లో కనిపించే అవకాశం ఉంది. ఆయన హీరోగా ‘శంకర, ‘పండగలా వచ్చాడు’, ‘సావిత్రి’, ‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘జో అచ్యుతానంద’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘తుంటరి’ చిత్రీకరణ దశలో ఉంటే, ‘కథలో రాజకుమారి’, ‘వాడే వీడు’ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
హీరోగా... ‘కత్తి’లా....
చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూడాలని ఎనిమిదేళ్లుగా తపిస్తున్న అభిమానుల కోరిక ‘బ్రూస్‌లీ’తో చిరు స్థాయిలో తీరింది. రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రంలో మూడు నిమిషాల సేపు గెస్ట్‌గా మెరిశారు చిరంజీవి. తాను త్వరలో చేయబోయే 150వ చిత్రానికి ఇది టీజర్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. 2016లో చిరంజీవి పూర్తిస్థాయి హీరోగా ‘కత్తి’లా తయారు కావడం ఖాయమని తేలిపోయింది. సో... లెటజ్ వెయిట్ అండ్ సీ.
సెంచరీ దారిలో....
2015లో ‘లయన్’గా కనిపించిన బాలకృష్ణ, 2016 సంక్రాంతికి ‘డిక్టేటర్’గా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. బాలకృష్ణకు ఇది 99వ సినిమా. సో.. ఇక నూరవ చిత్రం ఎలా ఉంటుంది? ఎవరి దర్శకత్వంలో చేస్తారు? అనే విషయంపై చర్చ సాగుతోంది. అతి త్వరలో ఈ సినిమా వార్త తెలుస్తుంది. వ్యక్తిగత విషయానికొస్తే.. ఈ ఏడాది బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రహ్మణి ఓ బాబుకు జన్మనిచ్చారు. తాత అయినందుకు బాలయ్య చాలా సంబరపడిపోయారు.
రెండు సినిమాలు గ్యారంటీ
ఈ ఏడాది నాగార్జున పూర్తి స్థాయి సినిమాలో కనిపించలేదు. అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’లో జస్ట్ అలా తళుక్కున మెరిశారంతే. 2016లో మాత్రం ఆయన కచ్చితంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను ఖుష్ చేయనున్నారు. ‘దసరా బుల్లోడు’ తరహాలో నాగ్ చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి రేసులో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ‘నా ఊపిరి’ కూడా ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక, బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎలానూ ఉంది.
బాబు బంగారం!
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేశ్‌బాబుతో కలిసి నటించిన వెంకటేశ్, ఈ ఏడాది పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. తండ్రి రామానాయుడు దూరం కావడం ఈ ఏడాది వెంకటేశ్‌కి అతి పెద్ద విషాదం.
► కమల్‌హాసన్ ఈ ఏడాది ‘ఉత్తమ విలన్’గా కనిపించారు. చాలా విరామం తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమాగా ‘చీకటి రాజ్యం’ చేశారు. వచ్చే ఏడాది ‘అమ్మా నాన్న ఆట’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
► కామెడీ చిత్రాల హీరోగా నవ్వించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ ఏడాది ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’, ‘అఖిల్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ తదితర చిత్రాల్లో కనిపించనున్నారు.
► ఈ ఏడాది ‘టై’, ‘వీడికి దూకుడెక్కువ’, ‘ఢీ అంటే ఢీ’ తదితర చిత్రాల్లో కనిపించిన శ్రీకాంత్ వచ్చే ఏడాది మరిన్ని ప్లానింగ్స్‌లో ఉన్నారు. ఈ ఏడాది తెరపై కనిపించని సుమంత్, తరుణ్, సాయిరామ్ శంకర్‌లు వచ్చే ఏడాది కొత్త చిత్రాలతో పలకరించనున్నారు.
► తమిళ స్టార్లు విక్రమ్ (‘ఐ), సూర్య (‘రాక్షసుడు’), విశాల్ (‘మగ మహారాజు’, ‘జయసూర్య’) చిత్రాల్లో కనిపించారు.
► ఈ ఏడాది సుశాంత్ సినిమా ఏదీ రాలేదు. ఆ లోటుని ‘ఆటాడుకుందాం రా’ సినిమా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
► ‘కొత్త జంట’ తర్వాత ‘అల్లు’ శిరీష్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు.
► వరుణ్ సందేశ్ ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘లవకుశ’ తదితర చిత్రాల్లో నటించారు.
► ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ చిత్రంలో హీరోగా నటించిన ప్రిన్స్, ‘నేను శైలజ’లో ముఖ్య పాత్ర చేశారు.
► ‘త్రిపుర’లో హీరోగా చేసిన నవీన్‌చంద్ర వచ్చే ఏడాది ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ తన లక్‌ని పరీక్షించుకోనున్నారు.
► ‘సింగమ్ 123’లో ఈ ఏడాది హీరోగా కనిపించిన సంపూర్ణేశ్ బాబు వచ్చే ఏడాది ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.వైరస్.కామ్’ తదితర చిత్రాల్లో కనిపిస్తారు.
► ‘రాజుగారి గది’తో హీరోగా ఎంటరైన అశ్విన్, ఇటీవల ‘జత కలిసే’తో గుర్తింపు తెచ్చుకున్నారు.