
ముంబై: తన పెళ్లిపై మీడియాలో వస్తున్న ఊహాగానాలను బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కొట్టిపారేశాడు. పెళ్లి విషయం దాచాల్సిన అవసరం తనకు లేదని, అందరికి చెప్పే పెళ్లాడతానని అన్నాడు. ఈ యువహీరో త్వరలో మలైకా అరోరాను పెళ్లాడనున్నట్టు మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై అర్జున్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అతడు తేల్చిచెప్పాడు.
‘నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెబుతాను. దాయాల్సిన అవసరం ఏముంది? నా సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకునే వారి జాబితాలో నేను లేను. నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోన’ని అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. తన గురించి ఎటువంటి గాసిప్స్ పుట్టించినా లెక్కపెట్టనని, సినిమా వాళ్లకు ఇవన్నీ మామూలేనని తేలిగ్గా తీసుకున్నాడు. మీడియా అంటే తనకు గౌరవం ఉందన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వ్యక్తం చేసే అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పాడు.
అర్జున్ కపూర్ నటించిన ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు. చరిత్ర నేపథ్యంలో అశతోష్ గోవారికర్ తెరకెక్కించనున్న ‘పానిపట్’ సినిమాలోనూ కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment