తప్పు నాదే.. మంచి సినిమా తీయలేకపోయా!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర స్థాయిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి లాంటి చిత్రాలకే కాదు.. మరెన్నో బ్లాక్ బస్టర్ కథలను అందించారు సీనియర్ రచయిత కే విజయేంద్ర ప్రసాద్. అయితే కలంతో అద్భుతాలను సృష్టించిన ఆయన.. దర్శకుడిగా మాత్రం విఫలమవుతూ వస్తున్నారు.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన శ్రీవల్లి చిత్రం అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. తొలి ఆటకే ఫలితం తేలిపోయిన ఈ చిత్రం పెద్దగా వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో చిత్ర ఫలితంపై ఆయన స్పందించారు.‘ఈ సినిమా కథ చాలా మంచిది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి మంచి అవుట్ పుట్ అందించారు. నిర్మాతలు కూడా భారీగా పెట్టుబడి పెట్టారు. కానీ, నా దర్శకత్వమే సినిమాకు మైనస్ అయ్యింది. నేను మంచి సినిమా అందించలేకపోయా’ అని వ్యాఖ్యానించారు.
రజత్, నేహాహింగే జంటగా ఏరోటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో శ్రీవల్లి చిత్రం తెరకెక్కింది. అయితే ఆసక్తికరంగా మలచకపోవటంతో చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. గతంలో ఆయన చంద్రహాస్, రాజన్నల చిత్రాలకు దర్శకత్వం వహించగా, అవి కూడా అంతగా మెప్పించలేకపోయాయి.