గల్లీల్లో లొల్లిలొల్లి చేసే తెలుగు ర్యాపర్ రోల్‌రైడా, సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే అమిత్ తివారీ బిగ్‌బాస్ షోలో కలుసుకున్నారు. రూపంలో, స్వభావాల్లో వీరిద్దరికి అస్సలు సంబంధం లేదు. కానీ వీరి మధ్య బంధం అల్లుకోవడానికి అంత సమయమేం పట్టలేదు. షో తొలి రోజు రాత్రి రైడా మాటలు విన్న అమిత్ రోల్ అయిపోయాడు. అమిత్ వేసిన జోకులకు రైడా కనెక్ట్ అయిపోయాడు. పరిచయమే లేని వారిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ‘బిగ్‌బాస్’ లైఫ్‌టైమ్ ఫ్రెండ్‌ని ఇచ్చిందంటూ చెబుతున్న వీరిద్దరి ‘షో’ జర్నీ విశేషాలు వారి మాటల్లోనే...
రోల్ రైడా ..
షో ప్రిపరేషన్
‘బిగ్‌బాస్’లో అవకాశం వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను. ప్రేక్షకులు మన వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేసే అధికారమిచ్చి ఆ షోలోకి వెళ్తాం. హౌస్‌లో ఎలాంటి సందర్భంలో అయినా మనం మనలాగా ఉండడం ముఖ్యం. రెండు మూడు వారాల్లో బయటకు వచ్చినా... పబ్లిక్‌లో మనం కనిపిస్తే గుసగుసలు పెట్టుకోకుండా, దగ్గరికొచ్చి ఒక సెల్ఫీ అడగాలి. ఇదే హౌస్‌మేట్స్‌కి చెప్పేవాణ్ణి. నేను బయటకు వచ్చాక అంతకుమించిన అభిమానం పొందుతున్నాను.
‘షో’ తర్వాత సర్‌ప్రైజ్
అభిమానం. ఈ షోకి ముందు నా వీడియోలు చూసిన వాళ్లు చాలా తక్కువ. షో తర్వాత తెలుగు రాష్ట్రాల వాళ్లే కాకుండా... ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లంతా నా వీడియోలు చూసి విషెస్ పంపిస్తుండ్రు. రోడ్ మీద కనిపిస్తే బండి ఆపేసి రోల్‌రైడా అని మాట్లాడుతున్నరు.
ఏం మిస్సవుతున్నారు?
పొద్దున్నే అమ్మ నిద్ర లేపుతుంది. అదేంటి పాట రావాలి కదా! నిద్రపోతే కుక్కలు మోరుగుతలేవ్? మాట్లాడుతున్నప్పుడు మైక్, ఏదీ చేయాలన్నా... ఇంకా బిగ్‌బాస్ చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నాను. చెప్పాలంటే ఇంకా బిగ్‌బాస్ హ్యాంగోవర్‌లోనే ఉన్నాను. బిగ్‌బాస్ వాయిస్ బాగా మిస్ అవుతున్నాను.
గిల్టీ ఫీలింగ్
టెంట్ టాస్క్‌లో దీప్తికి దెబ్బ తగిలింది. అది తెలియకుండానే జరిగినప్పటికీ, నావల్లే తలిగిందని చాలా బాధ పడ్డాను. మళ్లీ నాకోసం గణేశ్ ఒక వీక్ మొత్తం ఫ్రూట్స్ తిన్నాడు. తట్టుకోలేకపోయాను. తర్వాత గణేశ్ కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పుడు గిల్టీ ఫీలింగ్ తగ్గింది. ఆ వారం ఎలిమినేట్ అయినా ఫర్వాలేదని అనుకున్నాను.
రిగ్రెట్
కౌశల్ ఒక మాట అన్నప్పుడు ఎమోషనల్‌గా బస్ట్ అయ్యాను. కానీ అలా కాకుండా ఉండాల్సింది. ఏడ్చి చాలా మందిని బాధ పెట్టానని అనిపించింది. అసలు ఎందుకు అలా అయిందంటే... చెల్లి రావడం, అమిత్‌గాడు వెళ్లి పోవడంతో నాలో ఎమోషనల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఒంటరినైపోయాను. అప్పుడే కౌశల్ అలా అన్నారు. కెప్టెన్సీ వచ్చేది కాస్త పోయింది. ఇలా ఒక్కసారే చాలా ఫ్యాక్టర్స్, నేను ఎమోషనల్‌గా బ్రేక్‌డౌన్ కావడం, ఎగ్స్ సామ్రాట్‌కి ఇచ్చేయడం నా ఎలిమినేషన్‌కి కారణం కావచ్చు. ఎగ్స్ టాస్క్‌లో గెలిచే అవకాశం ఉంటే గివప్ చేసేవాడిని కాదు. నేను గెలవలేదని, ఇంకొకరు గెలవొద్దనే మెంటాలిటీ కాదు నాది.
‘హౌస్’లో మీ స్ట్రెంత్
బాండింగ్.. నేను ఒంటరిగా ఉండలేను. గొడవలున్నా ఇంటికి రాగనే మంచిగ పలకరిస్తే రిఫ్రెష్ అయిపోతం. అలా నాకు తోడున్నది అమిత్. చాలా మాట్లాడుకునేవాళ్లం. హౌస్‌లో అందరితో మంచి రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేశాను. అందరినీ ఎంటర్‌టైన్ చేసేవాడిని. ఆ ఎమోషనల్ బాండ్‌తోనే ఆ ఇంట్లో నేను ఉండగలిగాను. నా క్యారెక్టర్ కూడా అదే. అది ప్రేక్షకులకు నచ్చిందనుకుంటాను.
ఏం నేర్చుకున్నారు?
హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ ఎంత ముఖ్యమో అర్థమైంది. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫోన్‌తోనే గడుపుతుంటాం. ఇంట్లో వాళ్లకి టైమ్ ఇవ్వం. ఇంటికి రాగానే మన గురించి అడిగే వాళ్ల విలువ అక్కడ తెలిసొచ్చింది. బయట కొట్లాడితే మాట్లాడుకోం. కానీ బిగ్‌బాస్‌లో గొడవ అయినవాళ్లతో కలిసి టాస్క్ చేయాల్సి ఉంటుంది. మెంటల్, ఫిజికల్, బిహేవియర్... ఇలా అన్నింటికీ బిగ్‌బాస్ ఓ పరీక్ష. బిగ్‌బాస్ జర్నీ మనల్ని మనం పరీక్షించుకునేందుకు ఒక అవకాశం. అది కొనుక్కుంటే వచ్చేది కాదు... లక్కుండాలి. ఇంతకముందు వరకు నాకు మొహమాటం, స్టాండ్ తీసుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు నా ఇంటెన్షన్ బయటకు చెబుతున్నాను. నచ్చని విషయాలు బయటకు చెప్పడంతో మనసు తేలికవుతుంది.
అమిత్ ..
ఫ్రెండ్‌షిప్
అందరినీ ఎంటర్‌టైన్ చేయాలి, సరదాగా ఉండాలి. నాది, రోల్‌రైడాది ఇదే మైండ్‌సెట్. వాడు అదే విషయం ఫస్ట్ డే చెప్తుంటే విని కనెక్ట్ అయ్యాను. తర్వాత వాడు ఏ జోక్ వేసినా నేను పడిపడి నవ్వేవాణ్ణి. నేను ఏ జోక్ వేసినా వాడికి బాగా నవ్వు వచ్చేది. వాడికి నాకు ఒకటే తేడా... వాడికి జుట్టుంది, నాకు లేదంతే (నవ్వుతూ). బిగ్‌బాస్ షో నాకు లైఫ్‌టైమ్ బ్రదర్‌ని ఇచ్చింది. ‘లఫంగ్ గిరిగిట్టా ఫిలిం మేకింగ్’ టాస్క్ చాలా ఎంజాయ్ చేశాను. రోలి జోక్స్ మరిచిపోలేను.
‘షో’ తర్వాత సర్‌ప్రైజ్
ఇంటికొచ్చాక నా వైఫ్ సోషల్ మీడియాలో వచ్చిన లవింగ్ మెసేజెస్ చూపించింది. అలాంటి అభిమానం కోసమే షోకి వెళ్లాను. ఆ మెసేజెస్ చూసి నేను విన్ అయ్యానని అనుకున్నాను. బిగ్‌బాస్‌కి ముందు పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు దగ్గరికి వచ్చి ఎవరూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. అది మారాలి... నేను మామూలుగా ఎలాంటి వాడినో తెలియాలని ఉండేది. ఈ షో ద్వారా నేనేంటో చాలా మందికి తెలిసింది. ఈ షో తర్వాత దిగినన్ని సెల్ఫీలు నా లైఫ్‌లో ఎప్పుడూ దిగలేదు. సెల్ఫీలు అడిగిన వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ (నవ్వుతూ).
‘హౌస్’లో మీ స్ట్రెంత్
నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. దాంతో హౌస్‌లో ఉండగలననే నమ్మకం ఉండేది. ఇంకా మా వైఫ్, ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి పంపించారు. మేం బాగా ఉంటామని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండగలిగాను. హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి కూడా నేను ఎలా ఉన్నానో... అలానే నచ్చాను. కాబట్టే అన్ని రోజులు హౌస్‌లో ఉండగలిగానని అనుకుంటున్నాను.
షో ప్రిపరేషన్
లైఫ్‌లో ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ఉండేది. అదే ఆలోచనతో ఉన్నప్పుడు బిగ్‌బాస్ నుంచి కాల్ వచ్చింది. ఇంతకన్నా డిఫరెంట్‌గా చేయడానికి ఇంకా ఏం ఉంటుందని నా వైఫ్ ఎంకరేజ్ చేసింది. అంతకుమించి ప్రిపరేషన్ ఏమీ లేదు.
ఏం మిస్సవుతున్నారు?
అక్కడ ఒక సుప్రీం పవర్‌లా మమ్మల్ని గైడ్ చేసే బిగ్‌బాస్ వాయిస్‌ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా అక్కడి కెమెరాలను కూడా. ఇంట్లోవాళ్ల పేర్లు పెట్టి వాటితో మాట్లాడేవాడిని.
రిగ్రెట్
నేను రిగ్రెట్ అయ్యే విషయాలేమీ లేవు. చెరుకు రసం టాస్క్ ఫిజికల్‌గా చాలా కష్టమనిపించింది. ఫ్రీజింగ్ టాస్క్ మెమరబుల్. ఇక వేరే ఏ విషయాలు నాకు ఎక్కువ గుర్తులేవు. దాదాపు 100 రోజులు హౌస్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఏం నేర్చుకున్నారు?
నాకు ఫుడ్, నిద్ర, టీవీ అంటే చాలా ఇష్టం. 20 ఏళ్లుగా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా కంట్రోల్ చేసుకోవడం అలవాటైంది. నేను ఓవర్‌కం చేయగలిగాను.
‘సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేస్తడు. మరి ఇక్కడ కూడా కొట్లాటలు పెట్టుకుంటాడేమో’ అని అమిత్ తివారీ గురించి అనుకున్నాడు రోల్‌రైడా.
‘తలకు రంగు, చూడ్డానికి వింతగా ఉన్నాడు. ఈ ఇంట్లో ఎలా ఉంటాడో’ అని రోల్‌రైడా గురించి అనుకున్నాడు అమిత్ తివారీ.
బిగ్‌బాస్ హౌస్ ఎంట్రీలో ఒకరినొకరు చూసి వీరు మనసులో అనుకున్న మాటలివీ...
Comments
Please login to add a commentAdd a comment