
బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న అలీ రెజా.. ఎలిమినేట్ అవడం బిగ్‌బాస్ ఇంటి సభ్యులనే కాదు.. అతని అభిమానులను కూడా షాక్‌కు గురి చేసింది. ఆరు వారాల పాటు అసలు ఎలిమినేషన్ జోన్‌లోకే రాని అలీ.. సడెన్‌గా ఎలిమినేట్ అయ్యే సరికి హౌస్‌మేట్స్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అలీ రెజా ఇంటిని వీడిపోయే సమయంలో దాదాపు హౌస్‌మేట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కన్నీటిని ఎవరూ ఆపలేకపోయారు. శ్రీముఖి సైతం కన్నీటిపర్యంతమైంది. ఇంతమంది తన కోసం ఏడుస్తున్నారు.. బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోయినా.. వీరందరి ప్రేమ గెలుచుకున్నానంటూ అలీ తెలిపాడు.
అయితే అలీ రెజా బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని, త్వరగా ఎలిమినేట్ అయితే ఇంటికి రానివ్వమంటూ.. కుటుంబ సభ్యులు ఓ సందేశాన్ని కూడా పంపించారు. అయితే ఆ సందేశం వచ్చిన వారమే అలీ ఇంటిని వీడాడు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తన మామయ్య చనిపోయాడని, ఈ సంగతిని ఫ్యామిలీ మెంబర్స్ తనకు తెలియనివ్వలేదని అలీ రెజా సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
(బిగ్‌బాస్ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?)
‘నా జీవితంలో విజయాన్ని చూడాలనుకున్నారు.. అయితే ఇప్పుడు నాపై ఎంతో మంది అభిమానం చూపిస్తున్నారు. ఎంతో మంది నన్ను ప్రేమిస్తున్నారు. కానీ ప్రస్తుతం మీరు అవన్నీ చూడలేకపోతున్నారు. మిమ్మల్ని చివరి క్షణంలోనైనా చూడలేకపోయాను. బిగ్‌బాస్ నాకెంత అవసరమో తల్లిదండ్రులకు తెలుసు.. అందుకే మీ గురించి నాకు తెలియనివ్వలేదు. అయినా వారికి తెలీదు మీరు కూడా నాకు అంతే ముఖ్యమని.. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడమే నాకు ఓ షాక్‌లా ఉంటే.. బయటకు వచ్చాక మీరు లేరన్న వార్త మరింత షాక్‌కు గురిచేసింది. ఇంట్లో అనంతమైన బాధ ఉన్నా.. నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ నాకు సపోర్ట్‌ను ఇస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఇంతప్రేమను నేను చూశాకా.. నాకు ఇంకెమీ అవసరం లేదనిపిస్తోంది. మామా నువ్వు బెస్ట్. నిన్ను అంతిమ సమయంలో చూడలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. లవ్ యూ ఫర్ ఎవర్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలీ చేసిన ఈ పోస్ట్‌పై ఎంతో మంది అభిమానులు స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment