తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, పచ్చ... ఇవన్నీ కేవలం రంగులే కాదు. మనిషి జీవితంలోని వివిధ అనుభూతులకు సంకేతాలు. తెలుపు అంటే శాంతి.
తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, పచ్చ... ఇవన్నీ కేవలం రంగులే కాదు. మనిషి జీవితంలోని వివిధ అనుభూతులకు సంకేతాలు. తెలుపు అంటే శాంతి. నలుపు అంటే బాధ, ఎరుపు అంటే ఆకలి, పసుపు అంటే పవిత్రత. పచ్చ అంటే సౌభాగ్యం. మొత్తంగా మనిషి జీవితం ఇదే. ‘హోలీ’ పండగ సారాంశం కూడా ఇదే. కుల, మత, ప్రాంతరహితంగా వయోభేదం సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన పండగలు కొన్ని ఉంటాయి. అలాంటి పండగల్లో హోలీ కూడా ఒకటి. ఈ పండగ సందడి అలా ఉంటుంది మరి. అయితే... ఇది జనాలు జరుపుకోవడం ఒక ఎత్తు. సినీ తారలు జరుపుకోవడం మరొక ఎత్తు. ఇక బాలీవుడ్‌లో అయితే... సరేసరి. వీలైతే షూటింగుల్ని కూడా పక్కనపెట్టేసి, ఓ పనిగా జరుపుకుంటుంటారు అక్కడి సెలబ్రిటీస్. ‘రంగు పడుద్ది’ అనే రేంజ్‌లో ఉంటుంది ముంబయ్‌లో వీరి హంగామా. అదేంటో చూడండి.

రాజ్‌కపూర్ ఆధ్వర్యంలో...: సినిమా తారలందరూ ఒకేచోట హోలీ జరుపుకుంటే బాగుంటుందని మొట్టమొదట ఈ ఆనవాయితీకి శ్రీకారం చుట్టింది ప్రముఖ నటులు, దర్శక, నిర్మాత రాజ్‌కపూర్. ప్రతి ఏటా తన ఆర్కే స్టూడియోలో ఆయన హోలీ కేళీని ఏర్పాటు చేసేవారు. ఆ సంబరానికి అందర్నీ ఆహ్వానించేవారు. ఓ చిన్న కొలనులా తవ్వించి, రంగు నీళ్లతో నింపేవారు. ఎవరు ముందు వస్తే, వాళ్లని ఆ రంగు నీళ్లల్లో ముంచేవారు. ఫిమేల్ ఆర్టిస్టులు ఇబ్బందిపడకుండా జాగ్రత్త తీసుకునేవారట. వారి దగ్గర ఎవరూ అసభ్యంగా ప్రవర్తించడానికి వీలు లేని విధంగా ఏర్పాట్లు చేసేవారట రాజ్‌కపూర్. ఆ విధంగా ఆయన ఆధ్వర్యంలో జరిగిన సంబరాలను ఆ తర్వాత ఆయన వారసులు కొనసాగిస్తున్నారు.
‘బిగ్ బి’ ఇంట్లో సందడి: ఆర్కే స్టూడియో సంబరాల తర్వాత బాలీవుడ్‌లో బాగా పాపులర్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగే హోలీ కేళి. తన స్వగృహం ప్రతీక్షలో బిగ్ బి హోలీ సంబరాన్ని ఏర్పాటు చేస్తారు. రంగు నీళ్ల కొలను, గానా బజానా, రుచికరమైన వంటకాలు.. ఇలా అతిథుల కోసం బిగ్ బి కుటుంబం భారీ ఏర్పాట్లనే చేస్తుంది. రంగు నీళ్లల్లో ఆడిన తర్వాత ఫ్రెష్ అవ్వడం కోసం ప్రత్యేకంగా షవర్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఈ ఏడాది కూడా ఇలానే హోలీ జరపడానికి ప్లాన్ చేశారట. అమితాబ్ బచ్చన్
తొలి హోలీ కేళీలో సన్నీ: నీలి చిత్రాల్లో నటించి, శృంగార తారగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ కెనడాలో పుట్టి, పెరిగిన అమ్మాయి. పంజాబీ కుటుంబానికి చెందిన సన్నీ విదేశాల్లో పుట్టి, పెరగడంవల్ల భారతీయ పండగలు, సంప్రదాయాలు పెద్దగా తెలియవు. ఇక్కడికొచ్చి, హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె జరుపుకున్న తొలి పండగ దీపావళి. ఈ ఏడాది తొలి హోలీని జరుపుకోనున్నారు. ముంబయ్‌లో ఏర్పాటు చేసే ఓ ప్రత్యేక హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొనబోతున్న సన్నీ, అందర్నీ రంగు నీళ్లల్లో ముంచెత్తాలని ఫిక్స్ అయ్యారు. త్వరలో విడుదల కానున్న తన ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్ 2’ చిత్రంలోని ‘బేబీ డాల్...’ పాటకు డాన్స్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

లొకేషన్లో దీపికా పండగ!: దీపికా పదుకొనేకి హోలీ పండగ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే రంగుల పొడితో బయటకు తుర్రుమనేదాన్నని దీపికా పేర్కొన్నారు. దాదాపు వారం రోజులు హోలీ జరుపుకునేవారట. ‘ఆ వారం రోజులు నా వంటి మీద ఏదో ఒక రంగు ఉండటం, మా అమ్మ బాగా విసుక్కోవడం నాకింకా గుర్తే’ అంటున్నారు. పెద్దయిన తర్వాత వారం రోజులు జరుపుకునే వీలుండటంలేదనీ, ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక్క రోజు జరుపుకోవడమే పెద్ద కష్టమైపోతోందనీ అన్నారు. ఈ ఏడాది ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా లొకేషన్లో పండగ చేసుకుంటారట. ‘‘సాయంత్రం షూటింగ్‌కి పేకప్ చెప్పగానే యూనిట్ సభ్యుల మీద రంగు చల్లాలనుకుంటున్నాను’’ అని దీపికా చెప్పారు.
ఆట హానికరం కాకూడదంటున్న నర్గిస్: అమెరికాలో పుట్టి, పెరిగిన నర్గిస్ ఫక్రి

చాలా సరదా టైప్. అందుకే సరదా పండగ హోలీని మిస్ కాకూడదనుకుంటారు. అదే విధంగా సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుంటారామె. హోలీ ఆడేముందు పోనీటైల్ వేసుకుంటారట. కాటన్ దుస్తులు ధరిస్తారట. సురక్షితమైన రంగులనే వాడతానంటున్నారు నర్గిస్. హోలీ ఆట ముగిసిన తర్వాత వేడి వేడి నూనెతో తలని మర్దన చేసిన, వేడి నీళ్లతో తలస్నానం చేస్తానని, ఆ తర్వాత వంటికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటానని నర్గిస్ తెలిపారు. ప్రతి ఏడాదీ ఈ నియమాలు పాటించే నర్గిస్ ఈ ఏడాది మాత్రం మిస్సవుతున్నారట. షూటింగ్ ఉండటంవల్ల హోలీ జరుపుకోవడం లేదని పేర్కొన్నారు.
పండగ చేసుకున్న వీణా!: రెండు రోజుల ముందే వీణా మాలిక్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘దాల్ మే కుచ్ కాలా హై’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం యూనిట్ సభ్యులతో వీణా రంగుల పండగ చేసుకున్నారు. బేసిక్‌గా తాను కలర్‌ఫుల్ పర్సన్ అని, అందుకే రంగుల పండగ అంటే చాలా ఇష్టమని వీణా అంటున్నారు.ఇంకా బాలీవుడ్‌లో ఇలా హోలీ పండగ చేసుకుంటున్న తారలు చాలామందే ఉన్నారు.