గోన గన్నారెడ్డిగా బన్నీ
‘‘గోన గన్నారెడ్డి గొప్ప వీరుడు. రాబిన్ హుడ్ తరహాలో ప్రజల కోసం రుద్రమదేవితో పోటాపోటీగా తలపడ్డ వ్యక్తి. తెరపై కనిపించేది కాసేపే అయినా, రుద్రమదేవి పాత్రతో పాటు ఈ పాత్ర కూడా ప్రేక్షకులను వెంటాడుతుంది’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. అనుష్క టైటిల్ రోల్‌లో భారీ నిర్మాణ వ్యయంతో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. ఇందులో గోన గన్నారెడ్డి పాత్రకు హీరో అల్లు అర్జున్‌ను తీసుకున్నారు. ఈ విషయం తెలియజేయడానికి శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘పల్నాటి బ్రహ్మనాయుడు అనగానే ఎన్టీఆర్ గుర్తొస్తారు.
తెనాలి రామకృష్ణుడు అనగానే అక్కినేని నాగేశ్వరరావు గుర్తొస్తారు. తాండ్ర పాపారాయుడు అంటే కృష్ణంరాజు, అన్నమయ్య అంటే నాగార్జున గుర్తొస్తారు. అలా... గోన గన్నారెడ్డి అనగానే అల్లు అర్జున్ గుర్తొచ్చేంత గొప్పగా ఆయన పాత్ర ఉంటుంది. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకుంటున్నారు. యూత్ ఐకాన్ బన్నీ ఈ పాత్ర చేయడం ఆనందంగా ఉంది. జూలై నెలాఖరున ఆయనపై సన్నివేశాలు తీస్తాం. అల్లు అర్జున్‌కు ఓ హిట్ సినిమా బాకీ ఉన్నాను. ఈ సినిమాతో ఆ బాకీ తీర్చుకుంటా. గోన గన్నారెడ్డి సరసన అనామిక పాత్రను కేథరిన్ పోషిస్తోంది’’ అని చెప్పారు. చారిత్రక నేపథ్యంలో, త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేస్తానని తెలిపారు గుణశేఖర్.