
ఆ రెండు కలలు నెరవేరాయి
‘‘ఐదేళ్ల వయసులో ‘శివ’ చూసి, అందులో నాగార్జునగారిలా చేతికి సైకిల్ చైన్ చుట్టుకుని ఇంట్లో తిరిగేవాణ్ణి. సినిమాలంటే ఆసక్తి.
‘‘ఐదేళ్ల వయసులో ‘శివ’ చూసి, అందులో నాగార్జునగారిలా చేతికి సైకిల్ చైన్ చుట్టుకుని ఇంట్లో తిరిగేవాణ్ణి. సినిమాలంటే ఆసక్తి. నటుడిగా ప్రయత్నిస్తున్న టైమ్‌లో వర్మగారి దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని కలలు కనేవాణ్ణి. కట్ చేస్తే... వర్మ ‘వంగవీటి’తో హీరోగా పరిచయమయ్యా. ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి’’ అన్నారు సందీప్ కుమార్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ ఈ నెల 23న విడుదలైన విషయం తెలిసిందే. సందీప్ చెప్పిన సంగతులు...
►వర్మగారి దర్శకత్వంలో నటించాలనేది ఓ కల, పూరి జగన్నాథ్‌గారితో పని చేయాలనేది మరో కల. లక్కీగా పూరిగారు దర్శకత్వం వహించిన ‘జ్యోతిలక్ష్మీ’తో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యా. తర్వాత ‘లోఫర్’లోనూ ఓ పాత్ర చేశా. ఆ రెండిటిలో నా నటన రవితేజగారి ఎనర్జీ గుర్తు చేసిందని కొందరు ప్రశంసించారు. ∙రాధా, రంగాల గురించి కొంత సమాచారం, ఫొటోలు సేకరించి, వర్మగారితో డిస్కస్ చేసి, ఆయన చెప్పినట్టు చేశా. ‘నా కెరీర్‌లో నేను చూసిన గొప్ప నటుల్లో కాకినాడ కుర్రాడు సందీప్ ఒకరు’ అని వర్మగారు ట్వీట్ చేయడం అత్యుత్తమ ప్రశంస.
►మంచి దర్శకుడు, కథ లభిస్తే విలన్‌గా నటించడానికి రెడీ. కానీ, ఇప్పుడు వస్తున్నవన్నీ హీరో ఛాన్సులే. రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ∙‘మీ అభిమాన హీరో ఎవరు?’ అనడిగితే... ‘‘చిన్నప్పుడు దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘చిత్ర లహరి’ కార్యక్రమంలో చిరంజీవిగారి పాట రాలేదంటే ఏడ్చేవాణ్ణి. ఆయనంటే అంత అభిమానం. ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ల తర్వాత పవన్‌కల్యాణ్‌ను పిచ్చిగా ప్రేమించిన అభిమానుల్లో నేనూ ఒకణ్ణి’’ అన్నారు.