వారం రోజుల పైగా తెలుగు చలనచిత్ర సీమలో సాగుతున్న కార్మికుల సమ్మెకు తెరపడింది. హైదరాబాద్‌లోని ఎ.పి. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్‌స ఆవరణలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో, శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ వ్యవహారం ఒక కొలిక్కివచ్చింది. ఫిల్మ్ చాంబర్ మధ్యవర్తిత్వంలో ఎ.పి. చలనచిత్ర కార్మికసమాఖ్యకూ, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికీ మధ్య చర్చలు జరగడానికి దర్శకులు, కెమేరామన్లు, ఆర్‌ట డెరైక్టర్ల అసోసియే షన్లు చొరవ చూపడంతో రెండు పక్షాలూ ఒక అంగీకారానికొచ్చాయి. దీంతో, శనివారం నుంచి సినీ షూటింగ్‌లు మళ్ళీ మొదలయ్యాయి.
చిన్న సినిమాలకు పనిచేస్తున్నప్పుడు వేతనాల విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలంటూ నిర్మాతల మండలి ఇటీవల చేసిన ప్రతిపాదనకు సైతం సమాఖ్య ఎట్టకేలకు అంగీకరించింది. అయితే, సినిమా బడ్జెట్, షూటింగ్ దినాల లాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని చాంబర్, సమాఖ్య కలసి ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అన్నది నిర్ణయిస్తాయి. ఈ చర్చల్లో కార్మికుల ఫెడరేషన్ పక్షాన కొమర వెంకటేశ్, రాజేశ్వరరెడ్డి, ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పక్షాన చాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, దామోదర్ ప్రసాద్, ‘స్రవంతి’ రవికిశోర్, పరుచూరి ప్రసాద్, దర్శకుడు తేజ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ‘‘24 శాఖల సభ్యుల్ని మాత్రమే పనిలోకి తీసుకోవాలనే నిబంధన కొంత ఇబ్బందికరం. కొత్త చట్టాలు, ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా’ చట్టం లాంటివి వచ్చిన నేపథ్యంలో - మునుపటి పద్ధతిలోనే ఒప్పందం కుదుర్చుకుంటే, భవిష్యత్తులో కేసులొచ్చే ప్రమాదం ఉంది. అందుకే, నిర్మాతల మండలి, ఫెడరేషన్‌లు - ఈ రెండు పక్షాల లాయర్లూ కలసి కూర్చొని, నెలరోజుల లోపల ఒక నిర్దుష్టమైన ఒప్పందం రూపొంది స్తారు’’ అని వివరించారు. ‘‘గతంలో అంగీకరించిన మిగతా అంశాలన్నీ యథాతథంగా అమలవుతాయి’’ అని ఆయన తెలిపారు.
మరోపక్క ఈ సమ్మె వల్ల షూటింగ్‌లు ఆగిపోయి, ఇబ్బందులకు గురైన సినిమాలకు వెసులుబాటు కల్పించాలని కూడా ఫిల్మ్ చాంబర్ తీర్మానించింది. సెట్లు వేసుకొని, షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇబ్బందిపడ్డ నిర్మాతలకు స్టూడియోలు సహకరించాలని కోరింది. అలాగే ఆగిన చిత్రాలకు సహకరించిన తరువాతే కొత్త చిత్రాలకు అంగీకరించాల్సిందిగా నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ తెలిపింది. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే పెరిగిన కొత్త వేతనాలను అక్టోబర్ 21 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద సమ్మె విరమణ కావడంతో, సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సినిమాల షూటింగ్ మళ్ళీ జోరందుకుంది.
ముగిసిన సమ్మె... షూటింగ్‌స షురూ!
Published Sat, Dec 6 2014 11:16 PM | Last Updated on Thu, Mar 28 2019 5:30 PM
Advertisement
Advertisement